ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ -1గా విధులు నిర్వహిస్తున్న విజయకాంత్ రావుపై ( Joint register Vijaykumar ) చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్లు (Document writers ) ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవికి ఫిర్యాదు (Complaint ) చేశారు. పట్టణంలోని 59 సర్వేనెంబర్ భూమిలో ఇటీవల జాయింట్ సబ్ రిజిస్టర్ ఎల్ఆర్ఎస్ లేకుండా 80 ప్లాట్ లకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
గతంలో సైతం ఈయన ఏజెన్సీ ప్రాంతమైన ఈ యాపలగూడలో సరైన పత్రాలు లేని స్థలానికి సైతం రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి ,అక్రమాలకు నిలయంగా మారిందని, డబ్బులు లేనిదే ఏ పని జరగడం లేదని డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది దళారులుగా అవతారమెత్తి, ఇండ్లు స్థలాల కొనుగోలుదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అవినీతిపై ఇంతకుముందు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించు కోలేదన్నారు. సబ్ రిజిస్టర్ విజయకాంత్ రావుతోపాటు సిబ్బంది అవినీతిపై రిజిస్ట్రేషన్ శాఖ డీజీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.