నీరసంగా ఉందా.. చలి వేస్తోందా.. జ్వరం, ఒళ్లు, తలనొప్పి అనిపిస్తోందా.. చర్మంపై దద్దుర్లు వస్తున్నాయా.. ఆయాసం, కంటి కండరాల నొప్పి ఉందా.. వాంతులు, విరేచనాలు అవుతున్నాయా.. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుందా.. అయితే డెంగీ కావచ్చు.. వెంటనే చికిత్స చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఆరు కేసులు నమోదు కాగా.. ఈ వర్షాల నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యశాఖ అప్రమత్తమైంది. ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కొనసాగుతుండగా.. నేటి(సోమవారం) నుంచి స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలానికో స్పెషల్ ఆఫీసర్, టాస్క్ఫోర్క్ బృందాలను నియమించారు. ఈ బృందాలు అలర్ట్‌గా ఉండి.. కేసులు పెరుగకుండా చూసుకుంటాయి. ఏదైనా గ్రామంలో డెంగీ కేసు నమోదైతే.. ఆ ఊరంతా సర్వే చేసి కేసులను గుర్తిస్తారు.
నిర్మల్, జూలై 30(నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి అధికంగా వస్తాయి. వీటిలో డెంగీ ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే అన్ని జ్వరాలు డెంగీ కాకపోవచ్చని, ఎడీస్ దోమ కాటు ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ దోమలు ఇండ్లు, ఇంటి ఆవరణలోని కృత్రిమ నీటి నిల్వ ఆవాసాల్లో అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎడీస్ దోమలు పగటి వేళల్లో కాటు వేస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అధికారికంగా ఆరు డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పక్షం రోజుల్లో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరగక ముంతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అన్ని శాఖల సిబ్బందితో మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీలను వేసింది. ఈ కమిటీలను మండల పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు మానిటరింగ్ చేస్తారు. అలాగే ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఈ బృందం ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండి కేసులు పెరుగకుండా చూసుకుంటోంది. గ్రామంలో డెంగీ కేసు నమోదైతే.. ఆ ఊరంతా సర్వే చేసి కేసులను గుర్తిస్తున్నారు.
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
నిర్మల్ జిల్లాలో పక్షం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కమిటీలు రంగంలోకి దిగనున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పని చేసే ఈ బృందాల్లో సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బందితోపాటు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు ఉంటారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాలు డెంగీ, మలేరియా నియంత్రణకు పనిచేసే విధంగా ప్రణాళిక తయారు చేశారు. ఈ టీంలు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తాయి. వారం పాటు ఈ సర్వే కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సర్వేలో డెంగీ లక్షణాలు తేలితే వెంటనే వైద్యులు అలర్ట్ అవుతారు. నిర్మల్‌లోని టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లో డెంగీ పరీక్ష కోసం అత్యంత ఖరీదైన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆయా పీహెచ్‌సీల పరిధిలో రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రానికి పంపిస్తారు. లక్షణాలు ఉన్న వారు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు, పీహెచ్‌సీలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ఎన్ఎస్1 ఎలీసా, ఆరో రోజు ఐజీఎం ఏసీ ఎలీసా పరీక్షలను పూర్తి ఉచితంగా చేస్తారు.
డ్రైడేకు తోడు స్పెషల్ డ్రైవ్..
పారిశుధ్య పనుల కోసం సంబంధిత విభాగాలన్నీ రంగంలోకి దిగనున్నాయి. అపరిశుభ్రంగా ఉంటే దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో శానిటైజేషన్ పనులను ముమ్మరం చేయనున్నారు. మురుగు కుంటల్లో నీరు నిల్వ లేకుండా చేయడంతోపాటు వారానికి ఒక రోజు నీటిని మార్చుకోవాలని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ఈ బృందాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాయి. కాగా.. జూన్ నుంచే ప్రతి శుక్ర, మంగళవారం జిల్లా వ్యాప్తంగా డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక వైపు డ్రైడే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూనే, భారీ వర్షాలు కురిసిన కారణంగా ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.
డెంగీ లక్షణాలు
రోగికి చలిగా అనిపిస్తుంది.
జ్వరం, ఒళ్లు, తలనొప్పి ఉంటుంది.
రోగి నీరసంగా ఉంటాడు.
చర్మంపై దద్దుర్లు వస్తాయి.
ఆయాసం, కంటి కండరాల నొప్పి ఉంటుంది.
వాంతులు, విరోచనాలు అవుతాయి.
పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది.
మెదడు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది.
కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.
లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలి.
జాగ్రత్తలు..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
వారానికి ఒకసారి నీటి తొట్లు, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి, తుడిచిన తర్వాతనే నీరు నింపుకోవాలి.
ఇంటి లోపల, బయట పనికిరాని చెత్త ఉండకుండా చూసుకోవాలి.
ఉదయం, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
దోమ తెరలు వాడాలి.
నీళ్ల ట్యాంకులు, డ్రమ్ములు, మంచి నీటి పాత్రలపై మూతలు ఉంచాలి.
అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా వ్యాప్తంగా ఇటీవల అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దీంతో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం బాగా వచ్చిన వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని దవాఖానకు వెళ్లాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. చికిత్స సమయంలో రోగులు పలు జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి.
– ధన్‌రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిర్మల్