వాంకిడి, నవంబర్ 4: విద్యార్థినుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని ఆసిఫాబాద్ ఎ మ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం వాం కిడిలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. వంటగది, స్టాక్ రూంతో పాటు ఆర్వో వాటర్ ప్లాంట్‌లో పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హెచ్ఎం శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వాంకిడి మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, పీఏఎంసీ చైర్మన్ జబోరే పెంటు, మాజీ సర్పంచ్‌లు సరస్వతి, అయూబ్, బండే తుకారాం, భీమ్రావ్, మధుకర్, కొట్నక శంకర్, వార్డెన్, సిబ్బంది తదితురులు ఉన్నారు.
పాఠశాలలో పరిశుభ్రత పాటించాలి
వాంకిడిలోని బాలిక ఆశ్రమోన్నత పాఠశాలలో పరిశుభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సిబ్బందినిఐటీడీఏ పీ వో ఖుష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం ఆమె పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆయిల్‌ఫుడ్ అందించవ ద్దని, పౌష్టికాహారం అందించాలని వార్డెన్‌కు సూచించారు. ప్రతిరోజూ వంటగది, స్టోర్ రూ మ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉం డేలా చూడాలన్నారు. పాఠశాల చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లాలోని మాక్స్ కేర్ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ఇంటి బాట పడుతున్న విద్యార్థినులు
మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో వారం క్రితం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా గత రెండు మూడు రోజుల్లో మరో 30 మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంకిడి ప్రభుత్వ దవాఖానాలోనే సోమవారం 18 మంది, ఆశ్రమోన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. మరికొంతమందిని ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, హైదరాబాద్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో శైలజ, మహాలక్ష్మి, జ్యోతిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురై ఇంటిబాట పడుతున్నారు. ఆశ్రమంలో 590 మంది విద్యార్థినులు ఉండగా ప్రస్తుతం 95 మంది మాత్రమే ఉన్నారు. బయట ఫుడ్ తెచ్చుకొని తినడం ఇలా జరిగిందని హెచ్ఎం, వార్డెన్లు చెబుతుండగా నాణ్యత లేని రంగు మారినా భోజనం తిన్న తర్వాతే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు. ఐదు రోజులైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి రిపోర్టు ఇవ్వకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, నవంబర్ 4 : వాంకిడిలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, జాడి విలాస్, హరిశ్చంద్ర ప్రసాద్ వినతి పత్రం అందించారు.