బజార్హత్నూర్, జూన్ 11: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన సందర్శించారు. దవాఖానలో నెలకొన్న వైద్యులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. రాత్రి వేళల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందక పోవడం, సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఎదురొంటున్న ఇబ్బందుల గురించి వివరాలు తెలుసుకున్నారు. దవాఖానలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది హాజరు, రోగుల నమోదు పుస్తకాలు, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డులు, చికిత్స గదులు, ఔషధాల నిల్వలను తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది కొరత సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న సిబ్బందితోనే వైద్య సేవలు కొనసాగించాలని ఆదేశించారు. ఆమె వెంట సోనాల వైద్యాధికారి నవీన్ రెడ్డి, స్వప్న, హెచ్ఈవో సూర్య ప్రకాశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.