ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 22 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆసిఫాబాద్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్ జైలులో ‘ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం’ అనే అంశంపై ఆదివారం రెండో రోజూ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
జడ్జి మాట్లాడుతూ వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడిస్తే భవిష్యత్ బాగుంటుందన్నారు. తెలిసో.. తెలియకో క్షణికావేశంలో తప్పులు చేసి జైలులో ఉన్నవారికి ఆర్థిక స్థోమత లేకుంటే న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అదనపు జడ్జి యువరాజు, జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, బ్రహ్మకుమారి రాణి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అంజలీదేవి, జైలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.