మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 3 : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సైన్స్‌పై ఆసక్తిని పెంచడానికి చెకుముకి సైన్స్ పోటీలు దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో శని వారం పాఠశాల, మండల స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఎన్నో నూతన ఆవిష్కరణలకు, పిల్లల్లో నైపుణ్యత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిష్టయ్య, ఎంఈవో జాడి పోచయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సమగ్ర శిక్షా కో ఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ రేగండ్ల ఉపేందర్, శ్రీకాంత్, కూన రవికుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి చెకుముకి పోటీల్లో ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మీడియం నుంచి జన్నారం మండలం కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు లాసెట్టి శ్వేత, జీ అరవింద్ గౌడ్, ఆర్ విష్ణువర్ధన్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాలికలు జోయ, ఇన్షా తహ్రీన్, షబనాజ్, ప్రైవేట్ పాఠశాలల్లో చెన్నూర్ మండలం చిన్నమున్షి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వీ సాత్విక, సియా గిల్దా, హర్షిత్ దేవరాజ్‌లు ప్రతిభ కనబర్చారు. వీరంతా త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
జన్నారం, ఫిబ్రవరి 3 : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండలంలోని కిష్టాపూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విష్ణువర్ధన్, అరవింద్, అక్షయ ప్రతిభను కనబర్శి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండు రాజన్న తెలిపారు. ఇన్స్పైర్ పోటీలో మౌనిక రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.