Ambali | రెబ్బెన మే 24: ఎండాకాలం ప్రారంభం అయిందంటే చాలు అంబలి పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దేవర వినోద్ ప్రతీ సంవత్సరం వేసవికాలంలో అంబలి పంపిణీ నిర్వహిస్తూ ఆకలి, దాహార్తిని తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇందిరానగర్ గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడొద్దని వారికోసం అంబలి పంపిణీ ప్రారంభించి తర్వాత ఇంద్రానగర్ తో పాటు రెబ్బెన మండల కేంద్రంలో అంబలి పంపిణీ ప్రారంభించి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు తోడ్పాటు అందించడం వల్ల ప్రతీ రోజు 50 నుండి 60 కిలోల జొన్నలను ఉపయోగించి అంబలి తయారుచేసి పంపిణీ చేసే కేంద్రాల వద్దకు పంపించి అంబలి పంపిణీ కొనసాగిస్తున్నారు. సామాజిక సేవ కార్యక్రమాలలో ముందుండే దేవర వినోద్ కు ఎన్నో అవార్డులు ప్రశంసా పత్రాలు లభించాయి. వేసవికాలం ముగిసే వరకు అంబలి పంపిణీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.