సమాజానికి ఆరోగ్యవంతమైన శిశువులను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసింది
భైంసా దవాఖానలో పెరిగిన ప్రసవాలు
పథకాన్ని సద్వినియోగం చేసేకుంటున్న గర్భిణులు
భైంసాటౌన్, జనవరి 5 : సమాజానికి ఆరోగ్యవంతమైన శిశువులను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా భైంసా దవాఖానలో ఐదేండ్లలో లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10వేలు దాటింది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు ప్రభుత్వం అందజేస్తున్నది. అలాగే ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను ఇంటి దగ్గర దించడానికి ప్రత్యేక వాహన సౌకర్యం కల్పించింది. దీనికి తోడు మాతాశిశు మరణాలు తగ్గించేందుకు అమలు చేస్తున్న మిడ్ వైఫరీ విధానం సత్ఫలితాలిసున్నది.
ఇప్పటి వరకు 10,861 మందికి లబ్ధి
కేసీఆర్ కిట్, కార్పొరేట్ స్థాయి సేవలు, సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ప్రసూతి కోసం గర్భిణులు భైంసా సర్కారు దవాఖాన వైపు ఆసక్తి చూపుతున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 10,861 మంది కేసీఆర్ కిట్ అందుకున్నారు. 2017లో 2436 మంది, 2018లో 2149 మంది, 2019లో 1904 మంది, 2020 లో 1673 మంది, 2021లో 1595 మంది. ప్రస్తుతం నేటి వరకు 427 మందికి కేసీఆర్ కిట్ అందజేశారు.
పథకం ఎంతో ఉపయోగపడ్డది
ప్రభుత్వ దవాఖానాలపై ఎంతో నమ్మకం పెరిగింది. ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్‌తో పాటు డబ్బులు ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించింది. మొదటి కాన్పులో సర్కారు ఇచ్చిన 9 వేలు బ్యాంకులో డిపాజిట్ అయినప్పుడు చాలా సంతోషించాను. దవాఖానలో మందులు ఉచితంగా అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో బాగుంది. ప్రైవేట్ దవాఖానకు వెళ్లే స్తోమత లేని మాకు సర్కారు పథకం ఎంతగానో ఉపయోగపడ్డది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
-నిఖిత, తానూర్
రెండు కాన్పులకు కేసీఆర్ కిట్
నాకు ప్రసుత్తం రెండవ కాన్పు. మొదటి కాన్పుకు, రెండవ కాన్పుకు కేసీఆర్ కిట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా భర్త కూలీ పని చేస్తాడు. నేను గృహిణి. ప్రైవేట్‌లో ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు. కేసీఆర్ కిట్ చాలా బాగుంది. పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు ఉండడంతో బయట కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రూ.5 వేలు ఖాతాలో జమయ్యాయి. కేసీఆర్ సారు ప్రధాని అయితే దేశంలోని పేద మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది.
-సాజిదాబేగం, ముథోల్
సేవలు బాగున్నాయి
సర్కారు దవాఖానలో సౌకర్యాలు, వైద్యుల సేవలు కార్పొరేట్ కన్నా బాగున్నాయి. నా భర్త గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ సార్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డల సంక్షేమానికి పాటు పడడం సంతోషంగా ఉంది. మొదటి నెల నుంచి కాన్పు వరకు ప్రభుత్వ దవాఖానలోనే పరీక్షలు చేయించుకున్నాను.