చెన్నూర్ రూరల్, జూలై 17 : ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితా విడుదల చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా, రెండో విడుత ఊసెత్తకపోవడంపై ఆశావహుల్లో అసంతృప్తి కనిపిస్తున్నది. సర్కారు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా.. అని నిరుపేదలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. చెన్నూర్ మండలంలో తొలి జాబితాలో ఎంపికైన కొందరు మాత్రమే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొందరు నిధుల కొరతతో బేస్మెంట్, గోడలు, స్లాబ్ వరకే పనులు చేపట్టాల్సి వచ్చింది.
జూన్ 2న రెండో జాబితా విడుదల చేస్తామని.. మే-లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించగా, ఇప్పటి వరకూ హామీ నెరవేర్చకపోవడంపై దరఖాస్తు దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి బిల్లులకు తప్పని ఎదురుచూపులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు తొలి, మూడు విడుతల బిల్లులు విడుదలయ్యాయి. బేస్మెంట్ లెవల్ పూర్తియిన తర్వాత మొదటి బిల్లు రూ. లక్ష. గోడల వరకూ నిర్మాణం చేపట్టిన వారికి రెండో బిల్లు మరో లక్ష.. ఇక స్లాబ్ తర్వాత మూడో బిల్లు రూ. 1.40 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి బిల్లు రూ.లక్ష, మిగతా రూ. 60 వేలు ఉపాధి హామీ పనుల జాబితాను చేపట్టి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన వారికి చెల్లించాల్సిన చివరి విడుత బిల్లు అందలేదు. చివరి బిల్లులు, ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత వల్లే చివరి బిల్లులు, రెండో జాబితా ఆలస్యమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే రెండో జాబితా ప్రకటించి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
మాది నిరుపేద కుటుంబం. నేను కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న. సొంత ఇల్లు లేక పోవడంతో నాలుగేళ్లుగా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కిరాయికి ఉంటున్నం. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. తొలి జాబితాలో పేరు రాలేదు. రెండో జాబితాలోనైనా వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న. అధికారులు నా పరిస్థితి చూసైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– ఒద్ది నరేశ్. కారు డ్రైవర్, చెన్నూర్
చెన్నూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల తొలి జాబితాలో 645 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. వారిలో సుమారు 500 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ సుమారు 160 ఇండ్లు పూర్తయ్యాయి. మరికొన్ని బేస్మెంట్, గోడలు, స్లాబ్ దశలో ఉన్నాయి. తొలి మూడు విడుతల బిల్లులు సక్రమంగా విడుదలయ్యాయి. అయితే, నిర్మాణాలు పూర్తి చేసిన వారికి చివరి బిల్లు ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం రెండో జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. చెన్నూర్ మండలానికి 110 ఇందిరమ్మ ఇండ్ల ప్రతిపాదనలు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత అర్హులకు ప్రొసీడింగ్స్ అందజేస్తాం.
– భరణి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ