బజార్హత్నూర్, జూన్ 19 : ప్రజలు శుద్ధమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ఆయన రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ పని తీరును, నీటి శుద్ధి ప్రక్రియను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు కలుషిత నీరు తాగడం ద్వారా అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఆర్వో ప్లాంట్ ద్వారా లభించే శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. అనంతరం బజార్హత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రహరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి, శ్రీలక్ష్మి రెడ్డి, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, సర్పంచ్ రాథోడ్ లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు బెంచీల వితరణ
ఎదులాపురం, జూన్19: ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్‌లోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా బెంచీల వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాలలోని సుమారు 120 మంది విద్యార్థులకు సరిపడా బెంచీలను స్టోన్ హై సూల్ మేనేజ్మెంట్ ఆర్థిక సహకారంతో (ఫండింగ్) బాలవికాస్ సంస్థ ఈ బడికి గిఫ్ట్‌గా అందజేసింది. సంస్థ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో మా ధవి, బాలవికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీ. లక్ష్మి రెడ్డి, సంస్థ డైరెక్టర్ సైదిరెడ్డి, వివిధ సెక్టార్ అధికారులు, ఉ పాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.