సకల హంగులతో ఆకట్టుకునే తరగతి గది.. ఇంద్రధనస్సును తలపించే రంగు రంగుల స్క్రీన్.. తెరపై కండ్లేదుటే కదలాడే దృశ్యాలు.. వినసొంపైన కంఠం.. ఇదంతా కూడా డిజిటల్ బోధన తీరు.. బ్లాకు బోర్డులు, చాక్‌పీసులకు స్వస్తి పలికిస్తూ.. రాష్ట్ర సర్కారు సరికొత్త టెక్నాలజీ వైపు విద్యార్థులను తీసుకెళ్తున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 117 బడులు ఉండగా.. తొలి విడుతగా 72 పాఠశాలల్లోని 8,9,10 తరగతులకు డిజిటల్ బోధనను అమలు చేస్తున్నారు. మిగిలిన 45 స్కూళ్లలో రెండు, మూడు దశల్లో అమలు చేయనున్నారు. ఫలితంగా విద్యార్థులకు పాఠం సులువుగా అర్థమవడంతో పాటు ప్రవేశాల సంఖ్య కూడా పెరుగుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కాగా.. రెండు రోజులు కరెంటు లేకున్నా.. ఇంటరాక్టివ్ షార్ట్ ప్యానెల్ ద్వారా బోధన కొనసాగించవచ్చు. 75 అంగుళాల పొడువు ఉన్న ప్యానెల్‌ను డిజిటల్ బోధనతోపాటు బ్లాక్ బోర్డుగా కూడా వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
సారంగాపూర్/భైంసా, జూలై 15 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా 117 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 72 బడుల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో డిజిటల్ పద్ధతి ద్వారా విద్యాబోధన అందుబాటులోకి తెచ్చారు. మిగతా 45 పాఠశాలల్లో రెండు, మూడు విడుతల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు పుస్తకం ద్వారా బోధించిన పాఠాలను కొందరు విద్యార్థులకు పూర్తిగా అర్థం చేసుకోలేక పోవడంతో ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డిజిటల్ విధానంలో దృశ్య రూపంలో బోధన చేస్తుండడంతో పాఠాన్ని సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. విషయ పరిజ్ఞానం పెంపొందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా విద్యాధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొలి దశలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ విధానం అమలు చేయనుండగా.. సులువుగా పాఠం అర్థం అవుతుందని టీచర్లు చెబుతున్నారు. కొత్త విధానం ద్వారా సర్కారు బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.
కరెంట్ లేకున్నా బోధన ఆగదు..
డిజిటల్ విద్యా బోధనకు ఎంపికైన ప్రతి పాఠశాలలో ఇంటరాక్టివ్ షార్ట్ ప్యానెల్లు సమకూర్చారు. 8,9,10 తరగతుల వరకు ఒక్కొక్క ప్యానెల్ సుమారు రూ.5 లక్షల విలువ గల ఐఎఫ్పీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. కరెంట్ సరఫరా నిలిచినా సుమారు రెండు రోజులపాటు విద్యాబోధన చేసేందుకు వీలుగా 2 కేవీ యూపీఎస్‌లను సమకూర్చారు. 75 అంగుళాల పొడవు ఉన్న ఈ ప్యానెల్‌ను రెండు రకాలుగా వినియోగించుకునే వీలుంది. డిజిటల్ తరగతుల బోధనతోపాటు బ్లాక్ బోర్డుగా కూడా వినియోగించవచ్చని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.
సంతోషంగా ఉంది..
డిజిటల్ ప్యానెల్‌పై పాఠం చెప్పడం ద్వారా పాఠ్యాంశాల్లోని బొమ్మలను ప్రత్యక్షంగా చూడగలుతున్నాం. బొమ్మలు చూపుతూ సార్లు పాఠం చెప్పడంతో ఈజీగా ఉంది. పాఠాలు ఇంకా వినాలన్న ఆసక్తి పెరిగింది. తెరపై విన్న పాఠం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. డిజిటల్ బోధన అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉంది. – వైశాలి, 10వ తరగతి విద్యార్థి, స్వర్ణ పాఠశాల.
శ్రద్ధగా వింటున్నాం..
బడిలో డిజిటల్ పద్ధతిన బొమ్మలు చూపిస్తూ ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఇలా చెప్పడంతో ఆసక్తిగా వింటున్నాం. పుస్తకాల ద్వారా పాఠాలు చెప్పిన సమయంలో సరిగ్గా అర్థం కాకపోయేది. ఈ పద్ధతిన చెప్పిన పాఠం మంచిగా అర్థం అవుతుంది.
– తరుణ్, 9వ తరగతి విద్యార్థి, స్వర్ణ పాఠశాల.
సృజనాత్మకత పెంపొందుతుంది..
విద్యాశాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతోపాటు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రామంతాపూర్ సైట్ నుంచి విషయ నిపుణులచే డిజిటల్ క్లాసులు కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ క్లాసుల వల్ల విద్యార్థులకు లాభం జరుగుతుంది.
– రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా.