బేల, ఏప్రిల్ 16: యూడైస్‌లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థుల, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేలలోని అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఛాత్రోపాధ్యాయురాలు వెంకటమ్మ చేస్తున్న సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు.
పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ సర్వే కొనసాగుతుందని ఆయన పేరొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్ఏ-2 పరీక్షలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంఈవో కోల నర్సింహులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రహ్లాద్, ప్రత్యేకాధికారి నవీన, సీఆర్పీ వెంకన్న ఉన్నారు.
జైనథ్, ఏప్రిల్ 16: ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లోని జడ్పీ హై స్కూల్లో బుధవారం బీఈడీ విద్యార్థులచే యూడైస్ ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలను మొదటిసారిగా వచ్చిన డీఈవోను శాలువాతో సన్మానించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం లస్మన్న, డైట్ ట్రైనీ వాణి, ఉపాధ్యాయులు ఉన్నారు.
పాఠశాలలోని సమాచారాన్ని అందించాలి
దస్తురాబాద్, ఏప్రిల్ 16 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని పలు పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులు సునీల్, రాజేందర్ సమాచారాన్ని సేకరించారు. మండల కేంద్రంలోని పాఠశాలలో, మండలంలోని పలు పాఠశాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంఈవో గంగాధర్ మాట్లాడుతూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులకు సహకరించి, వారు అడిగిన సమాచారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం కోట వేణు, ఉపాధ్యాయులు, సీఆర్పీ తిరుపతి, ఐఆర్పీలు జగన్, ఉదయ్ పాల్గొన్నారు.