కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్ టౌన్/కాగజ్‌నగర్,ఆగస్టు 13 : పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు తెలియజేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి కార్మికులతో కలసి వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూ సీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లేశ్ పాల్గొన్నారు.
విధుల బహిష్కరణ
కాగజ్‌నగర్‌లోని సీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం రెండో రోజూ విధులు బహిష్కరించారు. పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దవాఖాన అపరిశుభ్రంగా మారడంతో ప్రైవేట్ వ్యక్తుల చేత శుభ్రం చేయించే యత్నం చేయగా, ఉద్యోగులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడారు. కొద్ది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తానని, విధులకు హాజరు కావాలని కోరగా, ఉద్యోగులు విధుల్లో చేరారు.