అమ్మవారి ఆలయానికి పోటెత్తిన జనం
కిక్కిరిసిన ఆలయ ఆవరణ, క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు
బాసర, జూన్ 10 : నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో దర్శనం కోసం వచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్యాస్నానాలు ఆచరించారు. భక్తులతో ఆలయ ఆవరణ, ప్రాంగణం కిటకిటలాడాయి.
దర్శనానికి భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రసాద విక్రయాల వద్ద కూడా రద్దీ కనిపించింది. అక్షరశ్రీకారాలు నిర్విరామంగా జరగడంతో భక్తులతో మండపాలు నిండిపోయాయి. బాసర బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. దాదాపు 40వేల మంది భక్తులు తరలివచ్చారు. రూ.వెయ్యి అక్షరాభ్యాసాలు 683, రూ.100 అక్షరాభ్యాసాలు 1760 అయ్యాయి. రూ.15 లక్షల ఆదాయం సమకూరింది.