ఇంద్రవెల్లి, ఆగస్టు 9 : నాగుల పంచమి పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం కిక్కిరిసింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చి పుట్ట వద్ద పాలు పోసి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. శుక్రవారం ఉదయం ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్ ఆధ్వర్యంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలను ప్రారంభించారు.
జిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్ష, జివితి, కిన్వట్, నాందేడ్, మాండ్వి, పాండర్కౌడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి బారులు తీరి దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాల్లో వెలిసిన తినుబండారాలు, హోటళ్లు, వివిధ రకాల దుకాణాల్లో వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తుల సందడి కనిపించింది. రంగుల రాట్నాల్లో చిన్నారులతోపాటు యువతీ, యువకులు ఊయాలలు ఊగుతూ సందడి చేశారు.
నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు మెస్రం వంశీయులతోపాటు కెస్లాపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వందలాది మంది భక్తులు పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి వసతిని కల్పించారు.
నాగుల పంచమిని పురస్కరించుకొని ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బాక సునీల్ ఆధ్వర్యంలో కెస్లాపూర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయంతో పాటు దర్బార్ ప్రాంతం లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.
నాగోబా ఆలయం వద్ద పోలీసులు ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కెస్లాపూర్ నుంచి ముత్నూర్కు చెందిన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనాల పార్కింగ్ కోసం సరిపడా స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిపారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో రోడ్డుపై గంటల తరబడి వాహనాలు నిలిచాయి.
బాసర, ఆగస్టు 9 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కనిపించింది. నాగుల పంచమిని పురస్కరించుకొని తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.