బోథ్, జులై 5: అందరి సహకారంతో సొనాల మండలాన్ని అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మండలంలోని సొనాలలో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ గోడం నగేశ్, జడ్పీటీసీలు అనిల్ జాదవ్, తాటిపెల్లి రాజు, కుమ్రం సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 2018 ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ సొనాల మండల ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రతిసారి ఎంపీపీ శ్రీనివాస్ సొనాల మండల విషయాన్ని మా ద్వారా వారికి విన్నవించారని చెప్పారు. ఇటీవల ఆసిఫాబాద్‌లో జరిగిన సమావేశంలో సీఎం కొత్త మండల ఏర్పాటును ప్రకటించారని తెలిపారు. సొనాల మండలం ఏర్పాటుతో ఈ ప్రాంతం అనిన రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. సొనాల ప్రాంత వాసుల కల నెరవేరిందని ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతకుముందు హనుమాన్ మందిరం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ చైర్మన్ డీ రాంరెడ్డి, స్థానిక సర్పంచ్ సదానందం, చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.