ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 24 : గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా ఇంటి పన్నుల వసూళ్లతో పాటు చేపడుతున్న అభివృద్ధి పనులు, పల్లె ప్రగతి, ప్రకృతి వనాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం ఇంటి పన్నులు వసూలు చేసిన వారు ఆన్లైన్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి శ్మశానవాటికలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనులు చేయాలన్నారు. పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఫిబ్రవరి 24 : ఉపాధి హామీ పథకంలో పనులు పకడ్బందీగా చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టే పనులు, ప్రగతి పురోగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన వారికి పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో స్వప్నశీల, ఏపీవో సురేందర్, తదితరులు పాల్గొన్నారు.