ఎల్నినో ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేక సాగునీరు అందని దుస్థితిలో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పొలాలు, చెలకలు నోరెళ్లబెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. చెరువుల్లో నీరు లేదు. వాగుల్లో నీరులేదు. చివరకు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల్లోనూ నీరు లేదు. వర్షాలు ముఖం చాటేయడంతో బోరు బావుల్లోనూ భూగర్భ జలనిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఫలితంగా పంటలు వాడిపోయి, ఎండిపోతున్నాయి. జూన్లో తొలకరి వర్షాలకే ఆశగా పత్తి, కంది, సోయా, జొన్న వంటి వర్షాధార పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పూర్తిగా వర్షాధారం కావడంతో వర్షాలు లేక వేసిన పంటను తీసేసి మరోసారి వేసేందుకు కొందరు సిద్ధమయ్యారు. కొందరైతే రెండోసారి విత్తనాలు వేసి వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక.. బోర్లు, బావుల్లో నీరు లేక.. ఇంటి నుంచి డ్రమ్ములు, బిందెలు, బకెట్లతో నీళ్లు తీసుకెళ్లి పొలాలను తడుపుకుంటున్న దీనమైన దుస్థితి క్షేత్రస్థాయిలో కరువు తీవ్రతకు అద్దం పడుతున్నది. కరువు పరిస్థితులను కళ్లకు కట్టేలా ‘నమస్తే తెలంగాణ’ బృందం అందిస్తున్న ఫొటో ఫీచర్..
– మంచిర్యాల, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి)

పూడిక తీయిస్తున్న..
లక్ష్మణచాంద, జూలై 15 : నా పేరు బొజ్జ భీమేశ్. మాది నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం. నాకున్న మూడెకరాలు ఉంది. ఇందులో రెండున్నరెకరాల్లో పసుపు, మొక్కజొన్న వేశా. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. దీనికితోడు భూగర్భజలాలు అడుగంటడంతో బావిలో కూడా నీరు లేదు. పంటలకు నీరందిస్తామంటే బావి ఎండిపోయింది. దీంతో రూ.9 వేలు ఖర్చు చేసి పూడిక తీయిస్తున్నా. బావిలో నీరు పడితే పంట పండినట్లు. లేకపోతే పంటలు ఎండినట్లే. ఇగ, ప్రభుత్వమే ఆదుకోవాలి.
మండుతున్న ఎండలు..ఎదగని వరినారు
దండేపల్లి, జూలై 15 : వానకాలం ప్రారంభమై నెల రోజులైనా దండేపల్లి మండలంలో వర్షాలు లేవు. ఇప్పటికీ 68శాతం లోటు వర్షపాతం నమోదైంది. మండల వ్యాప్తంగా ఇంకా 10 శాతం కూడా సాగు పనులు ప్రారంభం కాలేదు. కొందరు రైతులు వ్యవసాయ బావుల కింద వరినార్లు వేశారు. వర్షాలు లేక ఎండల తీవ్రతకు వరినారు ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు. ముందస్తుగా నార్లు పోసిన వారు నాటేసేందుకు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తిలో కలుపు తీయాల్సిన దశ ఉండగా సగం చేలల్లో విత్తనాలు కూడా వేయలేదు. దుక్కి దున్ని ఆకాశం వైపు చూస్తున్నారు. జూన్లో వేసిన పత్తి మొలకలు వాడిపోతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి కడెం, గూడెం, ఎత్తిపోతల నీరు అందితేనే పంటలు పండుతాయని రైతులంటున్నారు.
సాగుకు..తాగునీటికి గోస
సాగునీటికే కాదు, తాగడానికి కూడా నీళ్లు లేక మారుమూల గ్రామీణులు నరకయాతన పడున్నారు. వర్షాలు కురవక, బావుల్లో నీళ్లు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. మారుమూల గ్రామాలు, వాటి చుట్టుపకల ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం సమీపంలోని వాగుల బాట పట్టారు. వాగుల్లో చిన్న చెలిమెలు(గుంతలు) తవ్వి, ఊరే కొద్దిపాటి నీటిని గంటల తరబడి వేచి ఉండి బిందెలు, క్యాన్లలో నింపి కిలోమీటర్ల దూరంలోని ఇండ్లకు మోసుకెళ్తున్నారు.


