మంచిర్యాల, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ వారసత్వాన్ని.. నాయకత్వాన్ని.. ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుదామని దీక్షాదివస్ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పిలుపునిచ్చారు. సస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమానికి వారు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. దీక్షాదివస్ సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విధ్వంసమే తప్ప.. వికాసం లేదని మండిపడ్డారు. పాలకుల్లో విద్వేశం, విషం తప్ప విషయమే లేదన్నారు. అరాచకాలు, వేధింపులు, నిర్బంధాలు తప్ప తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న ఏ ఒక్క గ్యారంటీనైనా అమలు చేయడం కానీ, ఒక్క హామీనైనా నిలబెట్టుకునే ఆలోచన కానీ చేయడం లేదన్నారు. ఏడాది కాలంలోనే తెలంగాణలోని రైతులు, యువకులు, మహిళలు, బలహీన, సబ్బండ వర్గాల ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆ నాడు ఉద్యమంలో లేని వారు, రాష్ట్ర ఏర్పాటుకు కనీస ప్రయత్నం చేయని వారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తినోళ్లు, వాళ్ల బూట్లు నాకుతూ.. వాళ్ల సంచులు మోసకుంటూ బతికినోళ్లు.. ఈ రోజు ఏదో ఘనకార్యం చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారన్నారు.
ఎవ్వడన్న కాంగ్రెసోడు, తెలుగుదేశమోడు, బీజేపోడు.. ఆనాడు జై తెలంగాణ అన్నారా.. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉండి ఏనాడైనా పదవికి రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. అదే కేసీఆర్ ఎంపీ పదవికి రెండుసార్లు, కేంద్ర మంత్రి పదవికి ఒకసారి, డిప్యూటీ స్పీకర్ పదవికి ఒకసారి, ఎమ్మెల్యే పదవులకు ఎన్నోసార్లు రాజీనామా చేశారని గుర్తు చేశారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మొండి పట్టుదలతో పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని కొనియాడారు. తెలంగాణ తెచ్చినం.. తెలంగాణ ఉద్యమకారులం అన్న పేరు ముందు అన్ని పదవులూ చిన్నవే అన్నారు.
కేసుల మీద ఉన్న శ్రద్ధ.. ప్రజా సమస్యలపై లేదు..
కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు బయల్దేరిన రోజే (నవంబర్ 29) దీక్షాదివస్ అని బాల్క సుమన్ అన్నారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో పదేళ్లు బ్రహ్మాండంగా పనిచేశామని, దేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా తెలంగాణను నిలిపామనన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల విషయంలో ఒక్క తప్పటడుగూ వేయలేదన్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని చెప్పారు. పాలన మీద శ్రద్ధ లేదు కానీ.. పిచ్చి పనుల మీద శ్రద్ధ ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అని జెండాలు కట్టుకుంటే వాటిని ఎట్లా పీకేసుడు అనే దాని మీద శ్రద్ధ, మీటింగ్‌లు పెట్టుకుంటే ఎంతమంది వస్తున్నరు… ఎవరెవరు వస్తున్నరో చూసి వాళ్ల మీద కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడంపై ఉన్న శ్రద్ధ.. గురుకులాల్లో పిల్లలు చనిపోకుండా మంచి భోజనం ఎట్లా పెట్టాలనే దాని మీద శ్రద్ధ లేదన్నారు. మధ్యాహ్న భోజనం ఎట్లా పెట్టాలే… ఇథనాల్ ఫ్యాక్టరీని ఎలా రద్దుచేయాలి.. లగచర్లలో లంబాడా రైతులు భూములు ఇయ్యమని కొట్లాడుతుంటే వాళ్ల విషయంలో ఏం చేయాలనే దాని మీద శ్రద్ధ లేదన్నారు. ఫార్మాసిటీ, ఫోర్సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి ఫోర్ బ్రదర్స్ చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ప్రజల గొంతుకగా నిలబడుదాం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ లేదని బాల్క సుమన్ అన్నారు. మహిళలకు రూ.2500 లేవు. స్కూటీలు లేవు. ముసలోళ్లకు రూ.4000 పింఛన్ లేదు. రూ. రెండు లక్షల రుణమాఫీ లేదు. రెండు లక్షల ఉద్యోగాలు కాకి ఎత్తుకపోయింది. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. దళితబంధు రూ.12 లక్షలు లేదు. ఎస్సీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచుడు లేదని చెప్పుకొచ్చారు. ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన దిక్కు లేదన్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తూ.. ప్రజల పక్షాన కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గొంతుకగా.. వారికి అండగా గులాబీ దండు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ వారసత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, నాయకత్వాన్ని పునికి పుచ్చుకొని రాష్ట్రమంతా మరొకసారి తెలంగాణ ప్రజల కండ్లలో ఆనందం చూడడం కోసం, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసం కంకణ బద్ధులమై ముందుకు సాగుదామన్నారు. ఈ క్రమంలో మనపై దాడులైతయ్.. కేసులైతయ్.. జైళ్లకుపోతాం… ఇబ్బందులైతయ్.. అన్నారు. వాటన్నింటినీ వెంట్రుకులా తీసేసి చాకలి ఐలమ్మ, కుమ్రంభీం స్ఫూర్తితో ముందుకుసాగుదామన్నారు. ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలబడుదామని పిలుపునిచ్చారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే..
‘నేను అన్ని గమనిస్తున్నా.. ఏ అధికారి ఏం చేస్తున్నడు. ఏ నాయకుడు ఏం చేస్తున్నడు. అన్ని రికార్డు చేసుకుంటున్న’ అని బాల్క సుమన్ అన్నారు. నీనేం మారలేదని, నాలో ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉందన్నారు. సమయం, సందర్భం వచ్చేదాకా ఎదురు చూద్దామన్నారు. ఇందారం నుంచి మొదలుకొని సూపాక దాకా, వేంపల్లి నుంచి మొదలుకొని గూడెం దాకా అన్ని లెక్కలు వేసుకుంటున్నానన్నారు. వాళ్లు మంచిగ ఉంటే మీము మంచిగా ఉంటామన్నారు. అనవసర లొల్లి.. గొడవలు మాకు ఇష్టం లేదన్నారు. ప్రజలు ఓట్లు వేసిన్రు… మీకు అవకాశం ఇచ్చిన్రు.. అభివృద్ధి చేయాలని, ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని కోరారు. ధర్నాలు.. రాస్తారోకోలు.. రైలు రోకోలు.. మేము చేస్తే మీరు తట్టుకోలేరన్నారు. ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టండి కానీ.. ఇండ్లు కూలగొట్టడం మీద దృష్టి పెట్టకండని సూచించారు. మళ్లీ నూటికి నూరు శాతం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రశాంతమైన వాతావరణం దెబ్బతినడం ఇష్టం లేక ఓపిక పడుతున్నామన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ తోరణాలు, జెండాలు పీకేసిన అధికారులు ఇతర పార్టీల జెండాలు ఎందుకు తీయలేదో చెప్పాలన్నారు. ఈ విషయంలో అధికారులు కూడా పునరాలోచన చేయాలన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠం కదిలింది
– నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే
ప్రత్యేక రాష్ట్రం అడుక్కుంటే ఇవ్వలేదు. ఉద్య మ నేత కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠం కదిలి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ దీక్ష తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరినీ ఏ కం చేసి కదిలిచింది. నీళ్లు, నిధులు, నియామ కాల్లో తెలంగాణకు అ న్యాయం జరుగుతుం దని ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమా లు చేశారు. ఒక కార్యచరణతో ఉద్యమ బాట పట్టిన కేసీఆర్ గ మ్యాన్ని ముద్దాడే వరకు పోరాడారు. చావుకు భయపడకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మ హోన్నతమైనా వ్యక్తి కేసీఆర్. వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన ఘన త ఆయనకే దక్కుతుంది. పదేండ్లలో రామరాజ్యాన్ని తీసుకువచ్చారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ తెలంగాణ ఆనవాళ్లను లేకుండా చేయడానికి కుట్రలు చేస్తుంది. ప్రజా పాలన పేరుతో రాక్షస పాలన కొనసాగిస్తుంది. రోడ్లపై ఉన్న గులాబీ జెండాలను తీసేయవచ్చు.. కానీ, ప్రజల గుండెల్లో నాటుకుపోయిన గులాబీ జెండాను తీసేయడం మాత్రం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. వారు దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని ప్రజలు ఆవేదనతో ఉన్నారు. కరుడుగట్టిన గులాబీ దళం.. కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొంటుంది.
కేసీఆర్‌తోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడడంతో నే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ విష యాన్ని, ఉద్యమ చరిత్రను ఈతరం పిల్ల లకు మనమంతా చెప్పాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులను వదిలి పద్నాలుగేండ్లు కొట్లాడిండు. కేసీఆర్ స చ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నప్పు డు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదనకు గురైయ్యారు. అంతటి మొండిపట్టుతో ఉన్న కేసీఆర్ వల్లే రాష్ట్రం కల సాకరమైంది. రాష్ట్రం ఏర్పడకుంటే తెలంగాణ పూర్తిగా అణచివేతకు గురయ్యేది. రాష్ర్టా న్ని సాధించిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులుపెట్టించా రు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల చెంతకు పాలన అందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత చవిచూస్తున్నరు. ఇంతటి వ్యతిరేకత నా రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వాన్ని చూడలేదు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాలమే. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నరు. మనకు మంచిరోజులు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కార్యకర్తలు సమష్టిగా ప్రజల పక్షాన నిలబడి కలబడాలి.