ప్రణాళికలు రూపొందించిన అధికారులు
అశ్వరావుపేటకు క్షేత్రస్థాయి పర్యటనలు
సాగు విధానంపై అవగాహన
ఉమ్మడి జిల్లాలో 73 వేల హెక్టార్లలో సాగుకు నిర్ణయం
ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 3 వేల ఎకరాల్లో వేసేందుకు కర్షకుల అంగీకారం
నాలుగో ఏట నుంచి 30 ఏండ్ల వరకు లాభాలు
అంతర పంటలతోనూ అదనపు ఆదాయం
తాండూర్, మార్చి 13 : ఏటా ఒకేరకమైన పంటలు వేసి నష్టపోయే రైతులను లాభాలబాట పట్టించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ‘ఆయిల్ పాం’ను ప్రోత్సహిస్తూ అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 వేల హెక్టార్లలో వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పలువురిని కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లి సాగు విధానంపై అవగాహన కల్పించింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 3వేల ఎకరాల్లో వేసేందుకు 600 మంది ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ పంటతో నాలుగో ఏట నుంచి 30 ఏండ్ల వరకు ఆదాయం పొందే వీలుండగా, అన్నదాతల్లో ఆసక్తి కనిపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నది. ఒకేరకమైన పంటలు వేసుకోవడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదముండగా, మార్కెట్లో డి మాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లిస్తున్నది. ఈ నేపథ్యంలో మన నేలల్లో ఏయే పంటలు వేసుకోవచ్చని సర్వే నిర్వహించిన అధికారులు.. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించారు. ఆయిల్ పాం సాగుకు జిల్లాలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ తెలిపారు. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
సాగుపై విస్తృత ప్రచారం..
ఆయిల్ పాం సాగు కోసం విస్తృతంగా ప్రచారం చేసేందుకు అటు వ్యవసాయ, ఇటు ఉద్యానవన శాఖలు చర్యలు మొదలుపెట్టాయి. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతు బంధు సమితుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయిల్‌పాం సాగు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులను క్షేత్రస్థాయిలో ప ర్యటనలకు తీసుకెళ్లారు. మంచిర్యాల జిల్లా నుంచి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు మూడు విడుతల్లో వెళ్లారు. నాలుగో యేట నుంచి 30 ఏండ్ల వరకు నిరాటంకంగా పంట చేతికొస్తుందని, ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతుండగా, అంతర పంటలతోనూ అదనపు ఆదాయం పొందే వీలుంటుంది.
ఉమ్మడి జిల్లాలో 73 వేల హెక్టార్లలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 వేల హెక్టార్లలో ఆయిల్ పాం సాగు చేయాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లాలో 33,520 హెక్టార్లు, ఆదిలాబాద్‌లో 15 వేల హెక్టార్లు, మంచిర్యాల 12,800 హెక్టార్లు, ఆసిఫాబాద్‌లో 12,221 హెక్టార్లలో సాగుకు రైతులను సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి పంట మాత్రమే పండిస్తారు. మిగతా పంటలు వేసినా తక్కువ మొత్తంలో వేస్తారు. ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేయడంతో రైతులు నష్టపోతుండగా, ఆయిల్ పాం సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు యంత్రాంగం ఐదేండ్ల వరకు పకడ్బందీ ప్రణాళిక చేపట్టింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 600 మంది రైతులు 3000 ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గంలో 109 మంది రైతులు 284 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నారు.
నడుస్తూ… నడిపిస్తూ..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్వయంగా 30 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తూనే.. రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సమావేశంలో ఆయిల్‌పాం గురించి వివరిస్తున్నారు. దళారుల బెడద ఉండదని, నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కచ్చితంగా రైతులకు మేలు చేకూరుతుందని భరోసా నింపుతున్నారు. రైతులు ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు.
సాగు విధానం గురించి..
మా ఊరిలో నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. ఒకే పంట వేయడంతో నష్టం వస్తుంది. ఆయిల్ పాంతో మంచి లాభాలుంటయని అధికారులు చెబుతున్నరు. అందుకే నేను కూడా అదే పంట వేయాలనుకుంటున్న. నాలుగేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు ఆదాయం పొందవచ్చని అంటున్నరు. సాగు విధానం ఎలాగో తెలుసుకుంటున్న.
– చదువుల లక్ష్మణ్, రైతు, బోయపల్లి
ఈసారి ఆయిల్ పాం సాగు చేస్త..
నాకు గంపలపల్లి శివారులో ఏడెకరాల భూమి ఉంది. అందులో ఓ ఏడాది పత్తి వేసిన. మరోసారి మామిడి వేసి అంతర పంటగా పూల తోట పెట్టిన. కానీ లాభం లేకుంటైంది. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సర్కారోళ్లు ఆయిల్‌పాం సాగు చేయమని చెబుతున్నరు. కచ్చితంగా లాభముంటుందంటున్నరు. అందుకే ఈసారి కచ్చితంగా సాగు చేయాలనుకుంటున్నా.
– సబ్బని శ్రీనివాస్, రైతు, తాండూర్