ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 6 : బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహం చేయడం వల్ల చిన్నారుల భవిష్యత్తును నాశనం చేసినట్లు అవుతుందని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎకడైనా బాల్య వివాహం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 112, 1098కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్, ఎంపీవో మౌనిక, హెచ్ఎం వసంతరావు, సీడీఎస్ సూపర్వైజర్ లైలా, జెండర్ స్పెషలిస్ట్ రాణి, కౌన్సిలర్ చంద్రశేఖర్, శూర్ ఎన్జీవో ప్రతినిధులు దేవాజీ, ఉపాధ్యాయులు విట్టల్, మల్లేశ్, ఆత్మరావు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.