కోటపల్లి, అక్టోబర్ 12 : హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అత్తను రివాల్వర్‌తో కాల్చి హతమార్చిన ఘటనలో కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ రివాల్వర్‌ను చోరి చేసి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే గోదావరిఖని నుంచి కోటపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు. బుధవారం రాత్రి తనకు వారెంట్ కావాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని అడిగినట్లు సమాచారం. ఆయుధ కర్మాగారంలో ఆ బుక్ ఉండగా, తాళం చెవి తీసుకొని ఆ గదిలోకి వెళ్లిన ప్రసాద్ వారెంట్ బుక్‌తో పాటు ఎస్ఐ రివాల్వర్ తీసుకొని వెళ్లినట్లుగా అనుమానాలు వెలువడుతున్నాయి. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడం, పోలీస్ స్టేషన్ నుంచి రివాల్వర్ తీసుకొని వెళ్లిన ప్రసాద్ గుం డ్లసింగారంలో తన అత్త కమలను హతమార్చడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఘ టనా స్థలంలో అత్త కమల అక్కడికక్కడే చనిపోగా, స్థానికులు ప్రసాద్‌ను చితకబాదినట్లు సమాచారం.
కోటపల్లి కానిస్టేబుల్ ప్రసాద్ హన్మకొండ జిల్లాలోని గుండ్లసింగారంలో తన అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ చేపటారు. మంచిర్యాల డీసీపీతో పాటు జైపూర్ ఏసీపీ మోహన్ కోటపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ షార్ట్ వెపన్ ఎలా అదృశ్యమైంది.. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరు అనే విషయంపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. నివేదికను సీపీకి పంపనున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా ప్రసాద్ పై చోరీ కేసు నమోదైంది.