దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి, సామూహిక భోజనాలు చేశారు. ఆపై ‘చచోయ్ ఇట్ కోలారా….దేనే దేనారా…రేలా…రేలా..’ పాటలపై గుస్సాడీ నృత్యాలతో హోరెత్తించారు.
దండేపల్లి, అక్టోబర్ 16 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ వేడుకలు ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర నుంచేగాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు, మహిళలు సుమారు 500 మందికి పైగా ఆలయానికి తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేసి.. రేలా…రేలా… పాటలపై గుస్సాడీ నృత్యాలు చేశారు.
దండారీ ఉత్సవాలకు వేదిక కాకో ఆలయం
పద్మల్పురి కాకో ఆలయాన్ని దండారీ ఉత్సవ వేదికగా ఆదివాసీలు భావిస్తారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం గుస్సాడీ నృత్యాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీపావళి వరకు తమ తమ గూడేల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. దీపావళి రెండు రోజుల తర్వాత కోలబోడి కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు.
నైవేద్యాలు సమర్పణ
దండారీ ఉత్సవాల్లో భాగంగా పద్మల్పురి కాకోకు మహిళలు అతి పవిత్రతో నైవేద్యాలు తయారు చేశారు. పాయసంతో పాటు రుబ్బిన పెసరు, మినుములు, బబ్బెర గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దంచిన బియ్యంతో తయారు చేసిన అరిసెలు కూడా నైవేద్యంగా పెట్టారు. అనంతరం మేకలు, కోళ్లు బలిచ్చి ఆలయ సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు.
గోదావరి తీరం వద్ద పుణ్యస్నానాలు
భక్తులు ముందుగా గోదావరి నదికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత నదీ జలాలతో అమ్మ వారికి పూజలు చేశారు.
అలరించిన గుస్సాడీ నృత్యాలు
ఆలయ ఆవరణలో ప్రత్యేక ఆకర్షణగా గుస్సాడీ నృత్యాలు నిలిచాయి. నెత్తిన నెమలి పింఛంతో తయారు చేసిన టోపీలు, కళ్లద్దాలు, భుజాన జింక తోలు, నడుముకు, కాళ్లకు గజ్జెలు ధరించి, చేతిలో కోలా పట్టుకొని తప్పెట గూళ్ల వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు. గుస్సాడీ నృత్యాలకు ముందు మహిళలు బొట్టు పెట్టి గుస్సాడీల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ నెల 23న దర్బార్..
ఈ నెల 23న గుస్సాడీ దండారీ దర్బార్ నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దర్బార్ ఏర్పాటు విషయమై ఆదివాసీ పెద్దలు, పటేళ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచేగాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుడిమెత సోము నిర్వాహకులు పాల్గొన్నారు.