ఇంద్రవెల్లి, అక్టోబర్ 20 : ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతలకు భోగి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మండలంలోని పోల్లుగూడలో ఏత్మాసూర్ పేన్ దేవతలు (అకాడ పేన్ దేవతలు) ఉన్న ఇంటి ఆవరణలో ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం దండారీ ఉత్సవాల్లో గుస్సాడీలు ధరించే నెమలి ఈకలతో తయారు చేసిన టోపీలు, ఖోడాంగ్, ఏత్మాసూర్ పేన్ దేవతలు, డోల్, పిప్రే, సన్నాయి, తుడుం, డప్పులు, పాయిలి, తబలా, వివిధ వస్తువులను ఉంచి వాటికి సంప్రదాయం ప్రకారం పురుషులు, మహిళలు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భోగి పూజల అనంతరం గుస్సాడీలుగా మారే యువకులు ఒకే పల్లెంలో భోజనాలు చేశారు.
ఆడిపాడిన గుస్సాడీలు..
మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో గుస్సాడీలతోపాటు దండారీ బృందం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని లింగాపూర్, మాన్కాపూర్, గౌ రాపూర్, సాలెగూడ తదితర గ్రామాలకు చెందిన గుస్సాడీ దండారీ బృందం సభ్యులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో గుస్సాడీలు దండారీ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్ పటేల్, ఆలయ పూజారి మెస్రం షేకు, స ర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
గూడేల్లో సందడి..
తాంసి, అక్టోబర్ 20 : దీపావళి పండుగ సందర్భంగా గోండు గూడేల్లో గుస్సాడీ సందడి నెలకొంది. ఆదివాసీ గూ డేల్లో ఎటుచూసినా థింసా నృత్యాలు, డప్పుచప్పుళ్లు, గుస్సాడీ వేషధారణలతో అలరించే డ్యాన్యులతో పండుగ వాతావరణం నెలకొంది. వారం పాటు ఈ వేడుకలు మం డలంలోని అంబుగాం, గిరిగాం, అట్నంగూడ, బేతల్గూ డ, వామన్నగర్ తదితర ఏజెన్సీ గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఒక ఊరికి చెందిన వారు వేరే గ్రామాల గుస్సాడీ బృందాలను ఆహ్వానించి ఆతిథ్యం అందిస్తున్నారు.