రామకృష్ణాపూర్, మే 18 : కూరగాయల తోటకు కంచెగా విద్యుత్ తీగలు అమర్చడం వల్ల 13 బర్రెల మృతి చెందాయని, ఇందుకు కారణమై వ్యక్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పశువుల యజమానులు (. ఈ మేరకు ఆదివారం ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ వద్ద కోల్ బెల్ట్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ రామకృష్ణాపూర్‌లోని అమరావాది చెరువు సమీపంలో కూరగాయలు సాగు చేస్తున్న ఓ రైతు.. కంచెగా చుట్టూ విద్యుత్ తీగలను అమర్చడం వల్ల 13 బర్రెలు మృత్యువాతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బర్రెలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, తమకు తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పాడిరైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
కన్నెపల్లి/జైనూర్, మే 18 : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మెట్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఆదివారం విద్యుత్‌షాక్ తగిలి ఎద్దు మృతి చెందింది. మెట్‌పల్లికి చెందిన సీడం గంగారాంకు చెందిన ఎద్దు మేత కోసం వెళ్లిన సమయంలో మరో ఎద్దుతో పోట్లాడింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అది తగలగా, షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది.
ఎద్దు విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, అధికారులు తనకు నష్టపరిహారం అందించాలని రైతు కోరాడు. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పొలాసకు చెందిన రైతు ఆడే ప్రేమ్ సింగ్ తన ఆవును మేత కోసం విడిచిపెట్టాడు. స్థానికంగా ఉన్న టవర్ డీటీఆర్ ఎర్త్ ఆవుకు తగలగా.. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రేమ్‌సింగ్ వేడుకుంటున్నాడు.