కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఫెంజల్ తుఫాన్ పంటలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. పులి భయంతో కూలీలు చేలకు వెళ్లకపోవడంతో ఎక్కడి పత్తి అక్కడే ఉంటుండగా, అకాల వర్షానికి తడిసి ముద్దువుతున్నది. ఇక కల్లాల్లో పోసిన ధాన్యం కుప్పలు సైతం నాని నష్టపోయే ప్రమాదముండగా, అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది.
జిల్లాలో అకాల వర్షాలు పత్తి రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా జల్లులు పడుతుండగా, శుక్రవారం ఆసిఫాబాద్ డివిజన్లోని రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లో సుమారు గంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో చేలల్లో ఏరకుండా ఉన్న పత్తి తడిసిపోయింది. తేమ శాతం పెరగడంతో పాటు రంగుమారుతోంది. ఇలా అయితే పత్తికి మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చేల నుంచి ఇంటికి తరలించిన పత్తిలో సైతం తేమ శాతం పెరిగే అవకాశాలున్నాయి.
జైనూర్, వాంకిడి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తుండగా, రైతులు, రైతు కూలీలు పత్తి ఏరేందుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడుల చేస్తున్న నేపథ్యంలో చేలకు వెళ్లేందుకు వణికి పోతున్నారు. కిలో పత్తికి రూ. 12 ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నా కూలీలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే సరైన మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి.
జిల్లాలో పక్షం రోజుల క్రితం వరి కోతలు ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో వడ్లను అమ్మేందుకు రైతులు కల్లాల్లో కుప్పలు పోసుకొని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆకాశం మబ్బులు పట్టి జల్లులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 59 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, ఇంకా అమ్మకాలను పూర్తిగా ప్రారంభించలేదు. ప్రభుత్వం 36 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోని తేవాలని భావించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. దీంతో రైతులు ధాన్యం అమ్మేందుకు ఎదురుచూస్తున్నారు.