ఎదులాపురం,జనవరి11: తెలంగాణ రాష్ట్ర సీఎస్‌గా శాంతికుమారి నియామకం కావడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాత పొంగిపోయాడు. 1999 ఏప్రిల్ 4 నుంచి 1999 నవంబరు 11 వరకు కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన శాంతికుమారి రైతులు సహా అన్ని వర్గాల్లో మంచి పేరు సంపాదించారు. అప్పట్లో ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కాంటాల్లో మోసం జరుగుతున్నదని గ్రహించిన పత్తి రైతులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించారు. మార్కెట్‌యార్డులో తరాజు కాంటాల పద్ధతిని రద్దు చేసి ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేయించారు. పత్తి ధరల విషయంలో కూడా రైతుల పక్షాన నిలిచారు. రైతుపక్షపాతిగా పేరున్న కలెక్టర్ శాంతికుమారి బదిలీ కాగా, అన్నదాత సహా జిల్లా వాసులంతా బాధపడ్డారు. అప్పటి రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటి తహసీల్దార్లు వనజారెడ్డి (మావల), శ్రీదేవి (భీంపూర్) సహా పలువురు ఆమె సీఎస్‌గా నియామకం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సమర్థవంత అధికారికి సీఎస్‌గా బాధ్యతలు అప్పగించడంపై అంతటా హర్షం వ్యక్తమవుతున్నది.