మంచిర్యాల, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల గ్రామా ల్లో సాగు నీరందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకున్నది. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీరు లేక వరి సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. ఇందారం పక్కప ఉన్న రామారావుపేట పెద్ద చెరువులో నీరు అడుగంటిపోవడంతో ఇందారం, రామారావుపేట గ్రామాల్లో చెరువు కింద సాగయ్యే పొలాలకు నీరు అందడం లేదు. పొలాల్లో నీరు కనిపిస్తున్న చెరువు నుంచి వచ్చే కాలువలో నీటి ఫ్లోటింగ్ లేదు. దీంతో వరి పైరు ఎండిపోవడం మొదలైంది. దాదాపు నెలన్నర రోజులు చెరువు నుంచి నీరు వచ్చిందని గడిచిన వారం, పది రోజులుగా నీరు రాక పంట తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే గోదావరి ఉన్న అందులోనూ నీళ్లు లేవని రెండేళ్ల క్రితం గోదావరి నిండుకుండలా ఉండి, మా చెరువులో నీరు ఉండడంతో రెండు పంటలకు ఢోకా లేకుండా సాగు చేసుకునే వారిమని రైతులు అంటున్నారు.
రామారావుపేట పెద్ద చెరువు కింద దాదాపు 350 ఎకరాల్లో వరి సాగు చేయగా చెరువులో నీరు లేక ఎండిపోవడం మొదలైంది. మరో నెల రోజులపాటు నీరు సరఫరా చేయకపోతే పంట మొత్తం ఎండిపోవడం ఖాయమని రైతులు చెప్తున్నారు. వారం, పది రోజుల్లో భూములన్నీ నెర్రలువారి పొట్ట దశకు వచ్చిన పంట ఎండిపోక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు గోదావరి, ఇటు చెరువుల్లో నీరు లేక మండలంలో టేకుమట్ల గ్రామంలో బోర్ల కింద సాగు చేసే వరి పంటలకు నీరు అందడం లేదు.
భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, గంట సేపు బోరు నడిస్తే మరో గంట సేపు ఆపేయాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. ఇచ్చే 18 గంటల కరెంట్‌లో ఏడు, ఎనిమిది గంటలు బోరు నడిపినా.. పంట మొత్తం తడవడం లేదని వాపోతున్నారు. పైపులు మార్చుకుంటూ, అటూ ఇటూ తిప్పుకుంటూ కావలి కాసి నీరు అందిస్తే ఎకరం తడవడానికి రెండు రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి మా పంటలు ఎండిపోకుండా నీరు అందించాలని, లేనిపక్షంలో పంట ఎండిపోయిన రైతులు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపోక తప్పదని తమ కష్టాలను చెప్పుకుంటున్నారు.
నా పేరు బల్ల రాజు. బోర్ల కింద దాదాపు 25 ఎకరాలు సాగు చేసిన. బోర్లలో నీరు లేక పంట ఎండిపోతున్నది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఐదు రోజులుగా ఉన్న కొద్దిపాటి నీళ్లను కూడా పొలానికి పెట్టడం కుదరడం లేదు. నేను కరంటోళ్ల చుట్టూ తిరుగుతుంటే పొలం ఉల్లారే దశకు వచ్చింది. దాదాపు ఎకరం పొలం ఇప్పటికే ఎండిపోయింది. మా చుట్టు పక్కన పొలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకున్నది. సర్కారు స్పందించి రైతులకు న్యాయం చేయాలి. పంటలకు సాగునీరు అందేలా చేయాలి.
– బల్ల రాజు, రైతు, టేకుమట్ల.
రామరావుపేట పెద్ద చెరువు కింద ఇందారం శివారు లో ఐదెకరాల వరి వేశా. పంట వేసి రెండు నెలలు అవుతున్నది. యాసంగి సాగు మొదలుపెట్టేప్పుడు చెరువు నిండుగా నీరు ఉండే. పక్కను న్న గోదావరిలో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటి చెరువు ఎండి పోవటానికి వచ్చింది. దీంతో నీరు పార కానికి సరిపోక పొలం ఎండిపోయే దశలో ఉంది. ఇప్పటికే ఎకరం దాకా నెర్రెలు పారింది. ఐదెకరాలు వేసంగిలో నాట్లు వేయడానికి రూ.1.25 లక్షల వరకు ఖర్చు వచ్చింది. పంట పండుతుందన్న ఆశ లేదు. ఖర్చులు కూడా ఎళ్లని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– గడ్డం సందీప్, యువరైతు, ఇందారం.