సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 1: మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులకు కూడిన వానతో మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. గాలిదుమారంతో మామిడి పూత, పిందెలు, కాయలు నేలరాలాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి అందే సమయంలో అకాల వర్షం తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో రెండు రోజులుగా సర్వే చేసి నష్టం వివరాలను సేకరించారు. మంచిర్యాల జిల్లాలో 2252.30 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
మామిడి, మొక్కజొన్నపై తీవ్ర ప్రభావం..
ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలపై దండయాత్ర చేస్తున్నాయి. ఈదురుగాలుల బీభత్సం మామిడి, మొక్కజొన్న, వరి పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. బలమైన గాలులు వీయడంతో మంచిర్యాల జిల్లాలో పలు మండలాల్లో మొక్క జొన్న పంట నేలవాలిపోయింది. చేతికొచ్చిన పంట చేతికి అందకుండా పోవడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మంచిర్యాల జిల్లాలోని 6 మండలాల్లో మొక్కజొన్న, వరి, మామిడి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. పొట్టదశకు చేరుకున్న వరిపంట పైర్లు నేలకొరిగి అన్నదాతలను నిండాముంచాయి.
ఈదురుగాలుల బీభత్సంతో జిల్లాలో ఎక్కువగా మామిడి సాగు చేసే చెన్నూర్, భీమారం, నెన్నెల, చిత్తాపూర్, తాండూర్, బెల్లంపల్లి, తదితర ప్రాంతాల్లో గత నెలలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షంతో కొంత నష్టం జరుగగా, రెండు రోజుల క్రితం తీవ్రమై ఈదురుగాలులతో కూడిన వర్షంతో మామిడి పూత, పిందెలు, కాయలు మొత్తం నేలరాలి రైతులను నట్టేటా ముంచాయి. మంచిర్యాల జిల్లాలో 2252.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. వరి సాగు మొత్తం 4 మండలాలు, 21 గ్రామాల్లో 453 ఎకరాల్లో 318మంది రైతులు తమ పంటలు కోల్పోవాల్సి వచ్చింది. మొక్కజొన్న 6 మండలాల్లో 59 గ్రామాలు, 1799.3 ఎకరాల్లో 1186మంది రైతులు తమ పంటలు నష్టపోయారని అధికారులు అంచనా వేశారు.
1800 ఎకరాల్లో దెబ్బతిన్న మక్క..
లక్షెట్టిపేట మండలంలో 182.1 ఎకరాల్లో మక్క పంట దెబ్బతినగా 72మంది రైతులు నష్టపోయారు. హాజీపూర్ మండలంలో 287 ఎకరాల్లో దెబ్బతినగా 261మంది రైతులు నష్టపోయారు. దండేపల్లి మండలంలో 905 ఎకరాల్లో దెబ్బతినగా 639 మంది రైతులు నష్టపోయారు. జన్నారం మండలంలో 419 ఎకరాల్లో దెబ్బతినగా 208 మంది రైతులు నష్టపోయారు. తాండూర్ మండలంలో 5 ఎకరాల్లో పంట దెబ్బతినగా ముగ్గురు, బెల్లంపల్లి మండలంలో 1.2 ఎకరాల్లో దెబ్బతినగా ముగ్గురు రైతులు నష్టపోయారు.
453 ఎకరాల్లో దెబ్బతిన్న వరి..
లక్షెట్టిపేట మండలంలో 117 మంది రైతులకు చెందిన 113 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. హాజీపూర్ మండలంలో 255 ఎకరాల్లో దెబ్బతినగా 170 మంది రైతులు నష్టపోయారు. దండేపల్లి మండలంలో 80 ఎకరాల్లో దెబ్బతినగా 28 మంది రైతులు నష్టపోయారు. జన్నారం మండలంలో 5 ఎకరాల్లో పంట దెబ్బతినగా ముగ్గురు రైతులు నష్టపోయారు.