ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా
కొన్ని రోజులుగా అగ్నిప్రమాదా లు సంభవిస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైతులు యాసంగిలో జొన్న, మక్క సాగు చేశారు. ఇప్పటికే రెండు పంటల కోతలు ప్రారంభం కాగా.. మక్క కొనుగోళ్లు జరుగుతు న్నాయి. జొన్న పంటను కొందరు రైతులు కోయగా, చాలా మంది కోతలు ప్రారంభించ లేదు. కూలీలు, హర్వేస్టర్ల కొరత కారణంగా జాప్యం అవుతున్నది. పక్షం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. రైతులు వానకాలం పంటలను అధికంగా వేస్తారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రమే యాసంగి సాగు చేస్తారు. పంటల తీసివేత పూర్తవగా.. వానకాలం సాగు కోసం రైతులు భూములు సిద్ధం చేస్తున్నారు. దుక్కులు దున్నడం, చెత్తాచెదారం వ్యర్థాలను చేలలోనే కాల్చివేస్తారు. మరికొందరు బీడీలు తాగి పడేస్తుంటారు. దీంతో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.
– ఆదిలాబాద్, మే 4(నమస్తే తెలంగాణ)

భారీగా నష్టం
ఆదిలాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదాల కారణంగా రైతులు చేతికొచ్చిన జొన్న, మక్క పంటలను నష్టపోతున్నారు. పంట పూర్తిగా ఎండిపోవడం రెండు పంటల చెట్లు అగ్నికి తొందరగా అంటుకునే అవకాశాలుండడంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో రైతులకు చెందిన చేలు పక్కపక్కనే ఉండడంతో అగ్నికీలలు క్రమంగా విస్తరిస్తున్నారు. దీంతో రైతులు మంటలను ఆపే అవకాశం లేకుండా పోతున్నది. ఫైర్ ఇంజిన్‌కు వచ్చేంత వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. బోథ్ మండలంలో మూడు రోజుల్లో పొచ్చెర, నిగిని, ఖైర్తట్వా, కనుగుట్ట గ్రామాల్లో వందల ఎకరాల్లో జొన్న, మొక్క జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం కనుగుట్టలో దాదాపు 25 మంది రైతులు 60 ఎకరాల్లో పంటలు నష్టపోగా రూ.70 లక్షల వరకు నష్టం జరిగింది. ప్రమాదాల్లో రైతులు పంటలకు నీరు అందించడానికి ఉపయోగించే స్పింక్లర్లు, పైపులు కాలిపోతున్నాయి. అహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే కాలిపోతుండడంతో రైతులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి సాగు చేసిన పంటలు నష్టపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఏప్రిల్ 29 : బజార్హత్నూర్ మండలంలోని అంద్‌గూడ గ్రామంలో రెండెకరాల జొన్నతోపాటు వ్యవసాయ సామగ్రి, మోటార్, డ్రిప్ పైపులు, వైర్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది.
ఏప్రిల్ 30 : బోథ్ మండల కేంద్ర సమీపంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 12 ఎకరాలకు పైగా జొన్న అగ్నికి ఆహుతైంది.
మే 1 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ(బీ) గ్రామ పరిధిలోని సాకేర శివారులో రెండెకరాల్లో జొన్న పంట ట్రాన్స్ఫార్మర్ వద్ద 11 కేవీ తీగలు తెగి ఎల్టీ లైన్‌పై పడడంతో మంటలు చేలరేగి జొన్న పంట దగ్ధమైంది. జొన్నతోపాటు 20 స్పింక్లర్ పైపులు, సోలర్ సెట్ అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అలాగే పొచ్చెర గ్రామానికి చెందిన గొండ్ల స్వామి ఐదెకరాల జొన్న పంటతోపాటు ఇరవై పైపులు.. గొండ్ల వెంకటరమణకు చెందిన ఏడెకరాల మక్క, 50 పైపులు.. కంసాలి వెంకటికి చెందిన రెండెకరాల జొన్నతోపాటు ముప్పై పైపులు.. యటకారి రమేశ్‌కు చెందిన ముప్పై పైపులు దగ్ధమయ్యాయి. బజార్హత్నూర్ మండలంలోని భూతాయి(బీ) గ్రామానికి చెందిన కాల్బుర్గే మారుతి రెండెకరాల మక్క దగ్ధమైంది. దాదాపు లక్ష వరకు నష్టం వాటిల్లింది.
మే 2 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని భూతాయి(బీ) గ్రామ శివారులో మూడెకరాల పంట దగ్ధం కాగా.. సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లింది.

Adilabad
ప్రభుత్వం ఆదుకోవాలి
బోథ్, మే 4 : వానకాలం సోయాబీన్ సాగ చేయగా దిగుబడి అంతంత మాత్రం గానే వచ్చింది. ఆ లోటును యాసంగిలో తీర్చుకుం దామంటే పంటంత అగ్నికి ఆహుతైంది. ఎనిమిదెకరా ల్లో మక్క, నాలుగెకరాల్లో జొన్న వేశా. ప్రస్తుతం రెండు పంటలు కోతకు చేరుకోవడంతో ఒకట్రెండు రోజుల్లో కోత మొదలు పెడుదామని అనుకున్నా. ఈ తరుణంలో అగ్ని ప్రమాదంతో 12 ఎకరాల పంట కాలిబూడిదైంది. రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటేనే మళ్లీ వచ్చే వానకాలం సాగు చేయడానికి వీలు కలుగుతుంది. – మునిగెల రఘు, రైతు, కన్గుట్ట
నష్టపరిహారం చెల్లించాలి..
బజార్హత్నూర్, మే 4 : నాకున్న 2.20 ఎకరాల వ్యవసాయ భూమిలో జొన్న సాగు చేశా. పంట చేతికొచ్చే దశలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి పంట పూర్తిగా కాలిపోయింది. అంతేకాకుండా వ్యవసాయ పరికరాలు కూడా అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్నాయి. 90 డ్రిప్ పైపులు, 12 స్ప్రింక్లర్ పైపులు, డ్రిప్ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. వానకాలంలో వేసిన పంట చేతికి రాకపోగా.. ఈసారైనా అప్పుల నుంచి గట్టెక్కుదామంటే పంట అగ్నికి ఆహుతైంది.
– బెలే శంకర్, రైతు ఆంద్‌గూడ.
జొన్న, మక్క పంట దగ్ధం
ఇచ్చోడ, మే 4 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దూబర్పేట్ గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు కాత్లే రాములుకు చెందిన రెండెకరాల జొన్న, మక్క పంట పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయారు. అప్పులు చేసి సాగు చేసిన పంట బూడిదవ్వడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
జొన్న పంట..
తలమడుగు, మే 4 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం శివారు ప్రాంతంలో సోమవారం ప్రమాదశాత్తు జొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన శివయ్య రెండెకరాల్లో సాగు చేస్తున్న జొన్న పంట కోత దశకు చేరుకుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పంట దగ్ధమైంది. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ మంట చేలకు వ్యాపించడంతో శ్రీకాంత పొలంలో ఉన్న పైపులు, స్ప్రింక్లర్లు కాలి బూడిదయ్యాయి.