మంచిర్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారుతున్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్లు సోకుతుండగా, సలహాలు-సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తెగుళ్లతో పాటు ఎదుగుదల లోపించడం, ఎర్రబడటం, చెట్లు చనిపోవడం, ఆకు ముడతవంటివాటితో పంటలకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి నెలకొనగా, వ్యవసాయ విస్తరణ అధికారులు మాత్రం రుణమాఫీ లిస్టులను పట్టుకొని సర్వే పేరుతో ఊరూరా తిరగాల్సి వస్తున్నది.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 54 క్లస్టర్లలో ఈ సర్వే కొనసాగుతుండగా, ఏఈవోలు సుమారు 16 వేల మంది రేషన్ కార్డులు లేని వారి వివరాలను సేకరించి ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రారంభమై 10 రోజులవుతుండగా, మరో 20 రోజుల వరకు ఈ సర్వే కొనసాగే అవకాశమున్నది. రూ. 2 లక్షల రుణమాఫీపై చేతులెత్తేసిన సర్కారు ఇలా సర్వే పేరిట ఏఈవోలను వ్యవసాయక్షేత్రాలకు దూరం చేయడమేమిటని పలువురు మండిపడుతున్నారు.
కేసీఆర్ సర్కారులో..
పంటల సాగులో రైతులకు సలహాలు-సూచనలు అందించేందుకు కేసీఆర్ సర్కారు ఏఈవోలను నియమించింది. మండలాల్లో వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో ఏఈవోను నియమించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. కానీ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పేరిట ఏఈవోలకు అదనపు భారం మోపి రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.