పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2 బీహెచ్కే ఇండ్లను నిర్మించింది. కొన్నింటిని లబ్ధిదారులకు అప్పగించగా.. మరికొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కొన్నేమో 90 శాతం పనులు పూర్తి చేసుకుని ఫినిషింగ్ స్టేజీలో ఆగిపోయాయి. కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక చేసినా.. ఇండ్లను వారికి అప్పగించలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులను మొదలుపెట్టింది. జూన్ 2వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇక్కడి దాకా బాగానే ఉన్నా.. గత సర్కారు హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని పూర్తిగా విస్మరించింది. ఆ ఊసే ఎత్తకుండా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామంటూ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– మంచిర్యాల, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఒకవైపు వ్యతిరేకత.. మరోవైపు పూర్తికాని పనులు.. ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులనే ఎంపిక చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు చాలా గ్రామాల్లో నిరుపేద, మధ్య తరగతి కు టుంబాల జనం అధికారులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసే సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. జనం నుంచి వ్యతిరేకత వస్తున్నా.. పట్టించుకోకుండా ఇండ్ల పంపిణీకి సర్కారు సై అంటున్నది. పనులైనా పూర్తయ్యాయా అంటే అదీ లేదు.
మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలకు కలిపి 2,150 ఇండ్లు మం జూరు ఇచ్చారు. వీటిలో 914 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా, 179 ఇండ్లు పునాది వరకు వచ్చాయి. మూడు ఇండ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయి. ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు. జిల్లాలో 2,10,206 దరఖాస్తులు రాగా, కేవ లం 2 వేల మందినే ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2,148 ఇం డ్లు మంజూరు కాగా మంచిర్యాల జిల్లాలో మాదిరి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 769 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 356 ఇండ్లను భూమి పూజలు చేశారు. 102 ఇండ్లు బేస్మెంట్ లె వల్లోఉండగా, కేవలం ఎనిమిది ఇండ్లకు గోడల నిర్మాణం పూర్తయ్యింది. ఇంకా ఏ ఒక్క ఇంటి నిర్మాణం కూడా 100 శాతం అవ్వలేదు. ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇందిర మ్మ ఇండ్లు 1,653 మంజూరు కాగా, 792 ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు.
వీటిలో 250 ఇండ్లు బేస్మెంట్ లెవల్దాకా పూర్తయ్యా యి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణం ఇంకా పూర్తికా లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించ డం లేదు. సర్కా రు మాత్రం జూన్ 2వ తేదీ నుంచి పంపిణీకి సిద్ధం అవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉండగా పంపిణీ ఎలా సాధ్యం అవుతున్నదనేది అర్థం కాకుండా పోయింది.
కేసీఆర్ సర్కారు హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల మంజూరు, పనులు శరవేగంగా సాగాయి. కొన్ని చోట్ల వాటిని లబ్ధిదారులను పంపిణీ చేయగా.. చాలా వరకు పనులు పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. ఇప్పటికే లబ్ధిదారులు ఎంపికైన ప్రాంతాల్లో కేటాయింపులు చేయలేదు. కనీసం అవి చేసినా వేలాది మంది గృహ ప్రవేశాలు చేసుకునేవారు.
మిగిలిన వాటి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తే బాగుండేది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తే బీఆర్ఎస్కు ఎక్కడ పేరు వస్తుందోననే ఉద్దేశంతో పంపిణీని బ్రేక్లు వేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి కోట్ల రూపాయాల ప్రభుత్వ నిధులతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికేనా డబుల్ బెడ్రూం ఇండ్లపై సర్కారు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.