తాండూర్ : ఉపాధిహామీ పథకం రద్దుచేసి గాంధీ ( Gandhi ) పేరు తొలగించడం దుర్మార్గపు చర్య అని సీపీఎం పార్టీ తాండూర్ మండల కార్యదర్శి దాగం రాజారాం అన్నారు. సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా ( CPM dharna ) నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ 1948లో ఆర్ఎస్ఎస్ నేత గాడ్సే పిస్తోల్ తో గాంధీ ప్రాణం తీయగా నేడు మోదీ ప్రభుత్వం గాంధీ పేరు తొలగించారని ఆరోపించారు. క్రమేణా ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గ్రామీణ భారతాన్ని ఆకలితో చంపే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ కూలీలకు, అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఆసరాగా ఉపాధి చట్టం నిలిచిందని తెలిపారు.
మహాత్మగాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి తొలగించలేరన్నారు. కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, ఉపాధి హామీ కూలీలు వెల్పుల శంకర్, బొల్లం రాజేశం, పెరుగు, ఒండ్రీ రేవా, దుర్గం లీల, దుర్గం కవిత, కోట కుసుమ, డి లలిత, కార్మికులు పాల్గొన్నారు.