ఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పశువుల విక్రయాలు కొనసాగుతున్నాయి. జైన థ్, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాం తాల్లో పశువుల సంతలు ఉంటాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్ల అంగడీ ఉంటుంది. జిల్లాలోని రైతులతోపాటు మహారాష్ట్ర, ఇతర జిల్లాలకు చెందిన రైతులు, దళారులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఎడ్ల అంగడీకి వచ్చి పశువులను కొనుగోలు చేస్తారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జరిగే పశువుల సంతలో నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక రైతు లు ఇబ్బందులు పడుతుండగా.. మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. పశువులను కొనుగోలు చేసిన దళారులు వాటిని వాహనాల్లో కుక్కి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్న వాహనాల్లో పశువులను కదలలేని స్థితిలో కట్టి వేస్తున్నారు. ఎడ్ల కొనుగోళ్లు, అమ్మకాలను పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ అధికారులు ఇటువైపు రాకపోవడంతో దళారులు ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
రవాణ చట్టం ప్రకారం మూగజీవాలను తరలించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు ఉండాలి. ఈ వాహనాల్లో పశువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఒక్కో పశువుకు 3 మీటర్ల దూరం ఉండాలి. కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే తీసుకుపోవాలి. పశువులను ఆరు గంటలకు మించి రవాణ చేయరాదు. ఈ సమయం దాటితే పశువులను అనువైన ప్రదేశాల్లో దించి మేత, నీరు అందించాలి. పశువులను రవాణ చేయడంలో సంబంధిత శాఖల అధికారుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
ఎవరు, ఎవరికీ విక్రయిస్తున్నారనే వివరాలు తెలియజేయాలి. ఆవులు, దూడల రవాణా నిషేధం ఉండగా, వ్యవసాయానికి పనికిరాని ఎద్దులను రైతులకు మాత్రమే విక్రయించాలి. ఇందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. పశువుల రవాణాలో దళారులు నిబంధనలు పాటించడం లేదు. పత్రాలు లేకుండానే యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఆదిలాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో పశువుల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. మార్కెటింగ్ పశుసంవర్ధక, రవాణ, పంచాయతీ శాఖల అధికారులు పశువుల విక్రయాలను పర్యవేక్షించాల్సి ఉండగా, ఎవరూ పట్టించుకోకపోవడంతో మూగజీవాల రవాణా యథేచ్ఛగా సాగుతుంది.