
ఆదిలాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనుండగా, రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశమున్నది. 937 మంది ఓటర్లకుగాను 862 (91.78 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా టీఆర్ఎస్కు చెందిన వారే ఉండగా, ఆ పార్టీ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో గెలుస్తారని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానున్నది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు 937 మంది ఉండగా, ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో 862 (91.78 శాతం) మంది ఓట్లు వేశారు. ఇందులో ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించడానికి నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ ఉంటుంది. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు, సూపర్ వైజర్,ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్‌లను సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల్లోని టేబుళ్ల వద్దకు తీసుకువస్తారు. బాక్స్‌లోని ఓట్లను సిబ్బంది డ్రమ్ముల్లో పోస్తారు. ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వేర్వేరుగా చేసి 25 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కడుతారు. ఓట్ల కట్టలు కట్టడం పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు ఉంటారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.