చెన్నూర్, మార్చి 9 : పత్తి పంట చేతికందినప్పటి నుంచి అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు చెన్నూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోల్లు జరుగుతున్నాయి. రైతులకు పత్తి నవంబర్ నెలలో చేతికందింది. అప్పటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ రైతులకు అవస్థలు తప్పడంలేదు. చెన్నూ ర్ పట్టణ పరిసరాల్లోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోళ్లు చేస్తున్నది. ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి వరసగా ఒక్కసారి కూడా నెల రోజులు కొనుగోళ్లు చేయలేదు. వారం పాటు కొనుగోలు చేసి, మరో 15 రోజుల పాటు నిలిపివేస్తూ వస్తున్నది.
అలాగే ఇరువై రోజుల క్రితం సీసీఐ కొనుగోళ్లు చేస్తున్నామని ప్రకటించడంతో రైతులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో పత్తిని జిన్నింగ్ మిల్లు ల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆన్లైన్ పనిచేయడం లేదని సుమారు 12 రోజు లు పాటు, కొనుగోళ్లు నిలిపివేశారు. అప్పటివరకు వాహనాలను మిల్లుల వద్ద క్యూలైన్లో ఉంచాల్సి వచ్చింది. దీంతో రైతులు వాహనాలకు అదనంగా వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కొంత మంది రైతులు వారం చూసి ప్రైవేటు దళారులకు అమ్మకున్నారు.
సీసీఐ సక్రమంగా పత్తి కొనుగోళ్లు చేపట్టక పోవడంతో ఇంకా రైతుల వద్ద సగం కంటే ఎక్కువగా పత్తి నిల్వలున్నాయి. అయితే ఉన్నట్టుండి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి, పత్తి గింజలు నిల్వలు పేరుకపోయాయని, స్థలం లేదని, లేబర్ సమస్య కారణంగా జిన్నింగ్ చేయలేకపోతున్నామని, కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పలువురు జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనతో పత్తి నిల్వలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిన్నింగ్ మిల్లులో జిన్నింగ్ చేసే అవకాశంలేకపోతే సీసీఐ పత్తి కొనుగోళ్లు చేయలేరు. అప్పుడు దళారులకే పత్తి అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే తాము పండించిన పత్తి అమ్ముకోవడం ఇప్పటికే ఆలస్యమవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దళారులు తమ ఇష్టం వచ్చిన ధరకు పత్తి కొనుగోల్లను చేస్తున్నారు. దీంతో పత్తి రైతు ప్రతి క్వింటాలుకు రూ 600 నుండి రూ 700వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, రైతుల వద్ద పత్తి నిల్వలు అయిపోయే వరకు సీసీఐ నిరంతరంగా కొనుగోలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.