సీజన్ మొదటిరోజే రికార్డు స్థాయి ధర
మద్దతు ధర కంటే రూ.1920 అధికం
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఈ యేడాది 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
రైతులు నష్టపోకుండా అధికారయంత్రాంగం ఏర్పాట్లు
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.6380 ఉండగా, సీజన్ మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.8300 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేయగా, 26 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. పంట అమ్మకాల్లో రైతులు నష్టపోకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ): ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. పంటల సాగులో భాగంగా బీటీ విత్తనాలను ఉపయోగిస్తారు. యేటా జూన్ మొదటి వారంలో విత్తనాలు వేయగా, అక్టోబరు రెండో వారంలో దిగుబడులు ప్రారంభమవుతాయి. జిల్లాలో పంటల సాగుకు అనుకూలమైన నల్లరేగడి భూములు ఉండడంతో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా, జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను వేశారు. జూలైలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పంటకు నష్టం వాటిల్లింది. తర్వాత వాతావరణం సహకరించడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. పంటలో తెగుళ్ల నివారణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతు వేదికల్లో పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. గతేడాది పత్తి క్వింటాలుకు రికార్డు స్థాయిలో రూ.12 వేల ధరతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా పంట కొనుగోళ్లకు సంబంధించి కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు సంఘాల నాయకులతో చర్చించి పత్తి అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
క్వింటాలుకు రూ.8300
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ప్రారంభించారు. ధర విషయంలో రైతులు, వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మొదటిరోజు రికార్డు ధర పలికింది. ఈ ఏడాది క్వింటాలుకు రూ.6380 మద్దతు ధర ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారులు సీజన్ తొలిరోజే రూ. 8300 చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1920 ధర అధికంగా లభించింది. వ్యాపారులు పంటలో 8 శాతం తేమతో ధర చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పత్తిని ఎక్కువ విక్రయానికి తీసుకురాలేదు. సీజన్ ప్రారంభంలోనే మంచి ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పంట ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి.
పత్తిని పరిశీలిస్తున్న ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
రైతులు మోసపోకుండా చర్యలు : ఎమ్మెల్యే రామన్న
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి విక్రయానికి తెచ్చే రైతులు వ్యాపారుల చేతిలో మోసపోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు కొనుగోళ్లను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అమ్మకాల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నా రైతులు అధికారులను సంప్రదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదని రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, రైతు సంఘాల నాయకులు ఉన్నారు.