ఎదులాపురం, అక్టోబర్ 25 ః స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్నేహ గ్రూపులను గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో నిర్వహించే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో యువతుల భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు, ఓపెన్ సూల్, ఉల్లాస్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్ వంటి అంశాలపై వారికి మార్గదర్శకత్వం అందించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిలా పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లలో రైతులకు నష్టం జరగకుండా ప టిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మారెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మారెటింగ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రైతులకు మద్దతు ధర లభించేలా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా పత్తి కొనుగోళ్లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా జరగాలని ఆదేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలను ముందుగానే పరీక్షించేందుకు ట్రయల్ రన్ చేశామని వివరించారు. శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదిలాబాద్-ఏ, ఆదిలాబాద్-బి కొనుగోలు కేంద్రాలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ 27వ తేదీ నుంచి రోజు ఉదయం 9.00 గంటలకు రైతులు, జిన్నింగ్ మిల్ యజమానులు, సీసీఐ ప్రతినిధుల సమక్షంలో వేలం పాట ద్వారా ప్రైవేట్ ధర నిర్ణయించబడుతుందని పేరొన్నారు. ఈనెల 27 నాటికి ఆదిలాబాద్ లో ఏ, బి కేంద్రాల్లో 252 మంది రైతులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారని, మొత్తం సుమారు 8,128 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు.