జూన్ రెండో వారం పూర్తవుతున్నా వాన జాడ లేకపోవడంతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. మరోవైపు మండుతున్న ఎండలతో పత్తి విత్తనాలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వర్షాలు కురిస్తే విత్తనాలు మొలకెత్తేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విత్తిన విత్తనాల మొలకలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. సరిపడా వానలుంటేనే పత్తి సాగు సజావుగా సాగుతుందని, లేదంటే దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
– ఆదిలాబాద్, జూన్ 12 ( నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు. జూన్ నుంచి డిసెంబరు వరకు సీజన్ కొనసాగుతుండగా సకాలంలో విత్తనాలు నాటికే అక్టోబరు రెండో వారం నుంచి పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. ఏటా మే చివరి వారంలో విత్తనాలు కొని వర్షాల కోసం ఎదురుచూస్తుంటారు.
రెండు, మూడు వర్షాల పడి భూముల తడవగానే విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. జూన్ మొదటి వారంలో విత్తనాలు వేయడం ప్రారంభించి మూడో వారంలో పూర్తి చేస్తారు. వానకాలం సీజన్ ప్రారంభమైన జిల్లాలో వర్షాల జాడ లేదు. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్నది. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండలు మండిపోతున్నాయి. విత్తనాలు కొనుగోలు చేసి పంటల సాగుకోసం సిద్ధంగా ఉన్న పత్తి రైతులు వర్షాలు ఎప్పుడు పడుతాయనే ఎదురుచూస్తున్నారు.
వానల కోసం రైతుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటసాగుకు అవసరమైన నల్లరేగడి భూములు ఉండగా వర్షాలతో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 910 మిల్లీ మీటర్లు కాగా ప్రతి సంవత్సరం అధిక వర్షపాతం నమోదవుతుంది. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో 1213 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట ఆశించిన దిగుబడులు రావాలంటే వర్షాలు సకాలంలో పడాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే వానల జాడ లేకపోవడం వల్ల కాలం కలిసి వస్తుందా ? లేదా ? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
విత్తనాలు మొలకెత్తిన తర్వాత సైతం వానలు సరిగా పడకపోతే నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో సీజన్ ప్రారంభం నుంచి రెండు నెలల పాటు పంటల సాగుకు అనుకూలించాయి. ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాల కారణంగా రైతులు చేతికి వచ్చిన పత్తి, సోయాబిన్ పంటలను రైతులు నష్టపోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందకపోవడంతో రైతులకు నిరాశ చెందారు. ఈ ఏడాది వానకాలంలో సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకుందామని ఆశించిన అన్నదాతలకు వానల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
గతేడాది ఇప్పటికే విత్తనాలు వేశాం
ప్రతి సంవత్సరం ఇప్పటికే వర్షాలు పడ్డాయి. విత్తనాలు కూడా వేసినం. ఈ సారి సీజన్ ప్రారంభమై పది రోజులైనా వానలు పడలేదు. చెలక భూములు ఉన్న రైతులు వర్షాలు లేకపోవడంతో ఇంకా దుక్కులు దున్నలేదు. వానలు పడి భూమి తడిసిన తర్వాత దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సి ఉంటుంది. వర్షాలు జాడలేకపోవడంతో పత్తి రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడితే వారం రోజుల్లో వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. తర్వాత క్రమంగా వర్షాలు పడితే బతుకుతాయి. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటే మొలకెత్తిన విత్తనం చనిపోతుంది.
– సతీశ్, రైతు, కజ్జర్ల, తలమడుగు