ఆదిలాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లకు జనం రూ.10 వేలు ముట్టజెప్పాల్సిందే. అనధికారిక లే అవుట్లు, ఎన్వోసీ భూముల్లో ప్లాట్లకు ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యాలయం జరిగే ప్రతి పనికి ప్రజలు అధికారులు అడిగినంత చెల్లించుకోవాల్సిందే. విలువైన స్థలాల రిజిస్ట్రేషన్లు, ఇతర భూముల విషయంలో నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు పక్కన పెట్టి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారి, సిబ్బంది అవినీతిపై జూన్ 5న డాక్యుమెంట్ రైటర్లు అదనపు కలెక్టర్ శ్యామలదేవికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులకు భయపడకుండా అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏదో సాకుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తుండడంపై దరఖాస్తుదారులు విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. బేల మండలంలోని సిర్సన్నకు చెందిన మున్సుర్ఖాన్కు చెందిన గిఫ్డ్ డీడ్ కోసం రూ.5 వేల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికాడు.
మార్పు వచ్చేనా?
ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలు, బాధితులు ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. ఫిర్యాదుల వ్యవహారంలో ఉన్నతాధికారులు అంటిమట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. బాధితులు ఈ కార్యాలయంలో ఫిర్యాదులు చేయగా, విచారణ జరుపుతామంటున్న అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు.
ఈ కార్యాలయంలో మార్ట్గేజ్, రుణాల చెల్లించాక(రిలీజ్) పత్రాలు, గిఫ్డ్ డీడ్తోపాటు భూముల కొనుగోళ్లు, అమ్మకాల రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల వ్యవహారంపై డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందులు పడుతున్నారు. తాము రిజిస్ట్రేషన్లకు అవసరమైన పత్రాలు అన్ని సమర్పించినా అధికారులు, సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారని అంటున్నారు. ఏసీబీ దాడులతో అధికారులు, సిబ్బందిలో ఇకనైనా మార్పు రావాలని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..
ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం లో జరుగుతున్న అవినీతిపై జిల్లా అధి కారులు, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. తమ అవసరాల కోసం స్థలాల ను అమ్ముకునే ప్రజలు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం అధికారుల వేధింపులు భరించలేకపోతున్నారు. ప్రజలు ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశా లున్నాయి. వసూళ్లతో విసుగు చెందిన బాధితులు ఏసీబీని ఆశ్ర యిస్తున్నారు. జిల్లా కేంద్రంలో డీఆర్ కార్యాలయం అధికారులు దృష్టి సారించాలి. ఏసీబీ దాడులతో అయినా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల్లో మార్పు రావాలి.
– సాజిదొద్దీన్, ఆదిలాబాద్