సారంగాపూర్, జూలై 17 ః మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. వండి పెట్టకపోతే బిల్లుల బకాయిలను వదులుకోవాల్సి వస్తుందేమోననే భయంతో ఏజెన్సీలను కొనసాగిస్తున్నా రు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సర్కారు చెల్లింకపోవడంతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
సారంగాపూర్ మండల వ్యాప్తంగా ప్రాథమిక 45, ప్రాథమికోన్నత 5, ఉన్నత పాఠశాలలు 10 మొత్తం 57 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,045 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మండల వ్యాప్తంగా 91 మంది వంట సహాయకులు పని చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బిల్లులు సు మారు రూ.6.66 లక్షలు సర్కారు బకాయి ఉంది.
అప్పుల పాలవుతున్నాం..
మధ్యాహ్న భోజనం కోసం అప్పులు చేసి పిల్లలకు వంట తయారు చేసి అందిస్తున్నాం. బకాయిల కారణంగా చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వం బకాయిలు లేకుండా నెల నెలా బిల్లులను చెల్లించాలి.
– ఏనుగంటి రాజవ్వ, ఏజెన్సీ నిర్వాహకురాలు, జామ్
త్వరలో బిల్లులు చెల్లిస్తాం..
వంట ఏజెన్సీ నిర్వాహకులు మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థులకు అందించాల్సిందే. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరైన వెంటనే ఏజెన్సీల నిర్వాహకుల ఖాతాలో జమ చేస్తాం. మధ్యాహ్న భోజనం ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ బిల్లులను త్వరలోనే చెల్లించేలాచూస్తాం. నిర్వాహకులు ఆందోళన చెందాల్సిన పని లేదు.
– మధుసూదన్, విద్యాధికారి, సారంగాపూర్