మంచిర్యాల, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అనధికార బిల్డింగ్‌ల నిర్మాణాలు ఎక్కువయ్యాయి. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా భారీ భవంతులు కడుతుండగా, టౌన్‌ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తున్నది. మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్డు పక్కన బిల్డింగ్లు నిర్మించేవారు సెట్‌బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అవేవీ పట్టించుకోకుండా 10 ఫీట్లు, 20 ఫీట్లు ముందుకొచ్చి యథేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు. బెల్లంపల్లి చౌరస్తాలో నిర్మితమవుతున్న ఓ భారీ భవంతిపైన రెండు అంతస్తులకు అనుమతులు లేవు. కోర్టు పక్కన మారుతీనగర్, అశోక్‌రోడ్, ఓల్డ్ గర్మిళ్ల, మార్కెట్ ఏరియాలో నిర్మిస్తున్న భవనాల్లో అదనపు అంతస్తులకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు.
ఇలా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిల్లో ఎన్నో వీధుల్లో అక్రమ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ వింగ్‌లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో సకాలంలో స్పందించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటున్నారు. మరోవైపు అధికారుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన టేలాలు, బండ్లు పెట్టుకొని బతికే చిరు వ్యాపారులను తొలగించాలని ఇబ్బంది పెట్టే అధికారులు.. అనుమతులు లేకుండా భారీ భవంతులు కడుతున్న పెద్దలను మాత్రం ఏమీ అనడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.