కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది దాదాపు 55 కిలోమీటర్ల మేర 14 బీటీ రోడ్లు రెనివల్ చేసేందుకు రూ. 27 కోట్ల 68 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 7 రోడ్లకు రూ. 17.50 కోట్లు, సిర్పూర్ నియోజకవర్గంలో 7 రోడ్లుకు రూ. 10.18 కోట్లు మంజూరు చేసింది.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని బూరుగూడ నుంచి చిలాటి గూడ వరకు బీటీ రెనివల్ కోసం రూ. 2.77 కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభించి రూ. కోటీ 3 లక్షల బిల్లులు లేపుకొని అర్ధాంతరంగా వదిలేశారు. వట్టివాగు రోడ్ నుంచి కౌటాగూడ వరకు రూ. 1.53 కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభించి రూ. 30 లక్షలు లేపుకొని పనులు పూర్తి చేయకుండానే వదిలేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మంజూరైన 7 రోడ్లలో రెండింటిని ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసిన కాంట్రాక్టర్లు మిగతా రోడ్లను ఇప్పటి వరకు ప్రారంభించనేలేదు.
సిర్పూర్ నియోజకవర్గంలో ఏడాది క్రితం ప్రభుత్వం 7 బీటీ రోడ్ల నిర్మాణానికి రూ. 10.18 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ అధికారులను సంప్రదించగా బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని, త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇక్కడ కనిపిస్తున్నది కెరమెరి మండలం సాంగ్వీ నుంచి కర్పెత గూడకు వెళ్లే రోడ్డు (1.84 కిలోమీటర్లు). దీనిని బీటీ రోడ్డుగా మార్చేందుకు ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం రూ. 2.50 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి రూ.1.42 కోట్ల బిల్లులు కూడా లేపారు. ఆపై ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ రోడ్డు పూర్తయితే కర్పెత గూడతో పాటు రావుజీగూడ, ఖైరీ.. ఇంకా చిన్న చిన్న పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సాంగ్వీ నుంచి కర్పెత గూడకు వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై కూడా వంతెన సౌకర్యం కలుగుతుంది. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణం అర్ధాంతరంగా నిలిచి ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పెంచికల్పేట్ మండలంలోని రెబ్బన నుంచి కొండపల్లి మీదుగా లోడ్పల్లి గ్రామం వరకు వెళ్లే రోడ్డు. ఈ ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్డును రెనివల్ చేసేందుకు రూ. 2.70 కోట్లు వెచ్చించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయి. రోడుకు ఇరువైపులా కొట్టుకుపోయింది. లోడ్పల్లి, కొండపల్లి గ్రామాలతో పాటు గొల్లవాడ, జైహింద్‌పూర్ గ్రామాలకు వెళ్లే ఈ రోడ్డు గుంతలమయంగా మారింది.
రోడ్డుతో నరకం చూస్తున్నం
సాంగ్వీ గ్రామం మీదుగా కర్పెత గూడ వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉంది. ప్రయాణించాలి అంటే నరకం అనుభవించాల్సి వస్తున్నది. ఈ రోడ్డు మంచిగ చేస్తే కర్పెత గూడతో పాటు రావుజీ గూడ, ఖైరీ గ్రామంతో పాటు చిన్న చిన్న పల్లెలకు రాకపోకలకు ఇబ్బంది ఉండదు. కర్పెత గూడ వాగు వద్ద వంతెన నిర్మాణం కోసం ఏడాది కింద పిల్లర్లు వేసి వదిలేసిన్రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.
– నికోడే వసంత్‌రావు, సాంగ్వీ, కెరమెరి మండలం