శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం
నిర్మల్ జిల్లాలో 18 మండలాలో 547 చోట్ల పనులు
రూ.23 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
నిర్మల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రజలకు మె రుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్నచిన్న వర్షాలకే రోడ్లన్నీ చిత్తడిగా మారేవి. ఎండాకాలంలో దుమ్ముధూళితో ప్రయాణికులు అనేక అవస్థలు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో పల్లెల్లోని మట్టిరోడ్లను సీసీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తెప్పించుకొని, మండలాలకు నిధులు కేటాయించింది. నిర్మల్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 547 పనులకు రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఇ ప్పటికే పలు చోట్ల పనులు పూర్తయ్యాయి. ఆయా రోడ్ల నిర్మాణాలను జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతుండగా, ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో దశాబ్దాల నుంచి పడుతున్న ప్రయాణ కష్టాలు త్వరలో నే తీరనున్నాయి. గతంలో రోడ్లు బాగాలేక పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపలేని దుస్థితి ఉండగా.. మట్టిరోడ్లతో ఇప్ప టి వరకు ఇబ్బందులు పడ్డ గ్రామీణుల కష్టాలు తీరనున్నాయి.
పల్లెలకు కొత్త శోభ..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెలకు కొత్త కళ వచ్చింది. పల్లె ప్రగతి కార్యక్రమంతో పంచాయతీలకు ప్రభు త్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాల రూ పురేఖలే మారిపోతున్నాయి. నిర్మల్ జిల్లాలో జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి సీసీ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నియోజకవర్గాల వారీగా నిధులను మంజూరు చేసి అన్ని మం డలాల్లో పనులను గుర్తించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఈజీఎస్ కింద మొత్తం 547 పనులకు ప్రభుత్వం రూ.23.01 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 270 పనులు పూర్తయ్యాయని పీఆర్ శాఖ అధికారులు తెలిపారు.
మండలాల వారీగా ఇలా..
జిల్లాలోని 18 మండలాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల పను లు, కేటాయించిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. దిలావర్పూ ర్ మండలంలో 20 పనులకు రూ.95 లక్షలు మంజూరయ్యా యి. లక్ష్మణచాందలో 22 పనులకు రూ.1.07కోట్లు, మామడలో 48 పనులకు రూ.2.14కోట్లు, నర్సాపూర్(జీ)లో 24 పనులకు రూ.1.25 కోట్లు, నిర్మల్ రూరల్‌లో 29 పనులకు రూ.1.36 కోట్లు, సారంగాపూర్‌లో 42 పనులకు రూ.2.18 కోట్లు విడుదలయ్యాయి. సోన్‌లో 20 పనులకు రూ.1.51 కోట్లు, ఖానాపూర్‌లో 22 పనులకు రూ.2.55 కోట్లు, కడెంలో 51 పనులకు రూ.2.09 కోట్లు, బాసరలో 14 పనులకు రూ.48 లక్షలు, మథోల్లో 27 పనులకు రూ.78 లక్షలు, భైంసాలో 47 పనులకు రూ.1.17 కోట్లు, లోకేశ్వరంలో 46 పనులకు రూ.1.17కోట్లు, కుంటాలలో 23 పనులకు రూ.53 లక్షలు, తానూర్‌లో 39 పనులకు రూ.84 లక్షలు, కుభీర్‌లో 42 పనులకు రూ.82 లక్షలు, దస్తురాబాద్‌లో 12 పనులకు రూ.1.11 కోట్లు, పెంబిలో 19 పనులకు రూ.1.01 కోట్ల చొప్పున మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.
గడువులోగా పూర్తి చేస్తాం…
జిల్లా వ్యాప్తంగా సీసీ రోడ్ల పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటెకే చాలా చోట్ల పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఈ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చూస్తాం.
– శంకరయ్య, ఈఈ పంచాయతీరాజ్ శాఖ, నిర్మల్