ఆదిలాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ నుంచి జైనథ్, బేల మండలాల మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.194 కోట్లతో 33 కిలోమీటర్ల నిర్మాణంలో భాగంగా రెండు వరుసల రహదారితోపాటు వంతెనల నిర్మాణం కొనసాగుతోంది.
ఏడాది కిందట పనులు ప్రారంభం కాగా వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావాలి. రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వంతెనలు నిర్మించిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభించాల్సి ఉండగా.. రహదారి పనులు అయిన తర్వాత తర్నం వంతెన నిర్మిస్తున్నారని పేర్కొంటున్నారు. తర్నం పాత వంతెన ఒక పిల్లర్ కుంగినా ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేవారని, అధికారులు వర్షాకాలం ముందు బ్రిడ్జిని కూల్చివేసి రాకపోకలు జరగకుండా చేశారని వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండేండ్ల కిందట కురిసిన భారీ వర్షాలతో తర్నం వద్ద వంతెన కుంగిపోయింది. ఈ బ్రిడ్జిపై వాహనాలు ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధికారులు రాకపోకలు నిషేధించారు. అప్పుడు వాహనాల రాకపోకల కోసం రోడ్డు వంతెన కింది భాగంలో రూ.39 లక్షలతో చిన్న కల్వర్టును నిర్మించారు. గతేడాది వర్షాకాలంలో కురిసిన వర్షాలతో ఈ వంతెన కొట్టుకుపోగా.. ఇటీవల రూ.4.50 కోట్లతో మరో వంతెన నిర్మించారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా వంతెనను నిర్మించాల్సి ఉండగా అధికారులు తక్కువ ఎత్తులో పైపులు వేసి నిర్మాణం చేశారు.
ఇటీవల కురిసిన వర్షంతో ఈ వంతెన మీదుగా నీరు ప్రవహించి రాకపోకలు నిలిచాయి. నీటి ప్రవాహంలో వంతెన దాటడానికి ప్రయత్నించిన జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన యువకుడు కొట్టుకుపోయాడు. రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన పనులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిపై చిన్నపాటి వర్షాలకే నీరు ప్రవహిస్తుందని, దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తర్నం వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెల వల్ల వాహనదారులకు ప్రయోజనం లేదు. ఇటీవల కురిసిన వర్షానికి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ యువకుడు గల్లంతయ్యాడు. వర్షం నీరు వల్ల వాహనదారులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి కట్టాల్సి ఉండగా అధికారులు నామ మాత్రంగా నిర్మించారు. రోజు వందలాది వాహనాల రాకపోకలు సాగించే జాతీయ రహదారి పనుల విషయంలో అధికారులు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.
– రామన్న, కాప్రి, జైనథ్ మండలం