కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడెంలో గల కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పరిహారం కాజేసేందుకు కుట్రలు ( Conspiracy ) చేస్తున్నారని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్(Open Cast ) కాసిపేట, దుబ్బగూడెం భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో భూ బాధితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.
దుబ్బగూడెం ఓపెన్ కాస్ట్లో భూమి సాగు చేసుకున్నది తామైతే, పరిహారం మాత్రం భూమికి సంబంధం లేని వారికి, అక్రమార్కులకు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. దుబ్బగూడెం శివారు 146 సర్వే నెంబర్లోని 67 ఎకరాల భూములు ఎన్నో ఏళ్లుగా సాగు చేశామని, పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఇతరులకు పరిహారం ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
సర్వే నెంబర్ 144లో భూములకు సంబందించి పరిహారం విషయంలో రూ.1.30 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వచ్చిన వారు ఎస్టీల పేరుతో పరిహారం కొట్టేద్దామని చూస్తున్నారని, వెంటనే అధికారులు వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సాగులో ఉన్న బీసీలు, ఎస్సీలకు ఇవ్వమని, భూములు లేని ఎస్టీలకు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు, సింగరేణి అధికారులు మూడుసార్లు సర్వే చేసినా కూడా ఈ సమస్యకు ఎటువంటి న్యాయమైన పరిష్కారం చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బగూడం, కాసిపేట ఓపెన్ కాస్ట్ భూ బాధితులు బిజ్జూరి రాయలింగు, కందికట్ల చంద్రకళ, గోనెల శ్రీనివాస్, రత్నం రామస్వామి, రామటంకి రాజేందర్ గోనె లచ్చయ్య, కలాలి బాల శంకర్, లక్ష్మీ, నగురారపు సుమన్, పోశం, గ్రామస్థులు పాల్గొన్నారు.