మంచిర్యాల, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ చేయి జారిపోయిందా.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చెన్నూర్‌లో ఏం చేసినా గెలువలేమని బీఆర్ఎస్ పార్టీని, బాల సుమన్‌ని తట్టుకోవడం కష్టమని పోటీ చేయకుండా కాంగ్రెస్ తెలివిగా తప్పించుకుంటోంది. పొత్తుల పేరిట సీపీఐకి టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కాస్తో.. కూస్తో పోటీ ఇస్తోందనుకున్న కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోనుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారనుకున్న మాజీ ఎంపీ గడ్డం వినోద్ పోటీకి నిరాసక్తత చూపుతున్నారు. పార్టీకి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ లేకపోవడం, గతంలో వివేక్ ఎకడ పర్యటించినా జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనకడుగు వేస్తున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇకడ బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
పొత్తులో భాగంగా చెన్నూర్ టికెట్ సీపీఐకి ఇస్తారనే ప్రచారంతో కాంగ్రెస్ టికెట్ వస్తోందని ఆశించిన ఆ పార్టీ నాయకులు భంగపడ్డారు. ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందు నుంచి టికెట్ తమకే వస్తోందని చెప్పుకుంటూ తిరిగిన డాక్టర్ రాజా రమేశ్, రామిండ్ల రాధిక బయటికి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం 13 మంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు సీపీఐకి ఇస్తారనడంతో వారంతా కాంగ్రెస్‌లో ఉండలేని పరిస్థితి. ఒక వేళ ఉన్న ఏ మాత్రం సహకరిస్తారన్నది సందేహంగా మారింది. ఇప్పటికే ఎవరికీ వారు మేము అంటే మేము అని పోటీ పడుతూ వచ్చిన నాయకులు, అందరూ ఒక తాటి మీదకు వచ్చి ఇంకొకరికి సపోర్ట్ చేయడం అనేది జరిగేలా లేదు.
ఈ నియోజకవర్గంలో సీపీఐ అసలు లేనే లేదు. అసలే అభ్యర్థి కూడా లేరు. బెల్లంపల్లి నుంచి ఓ నాయకుడిని అరువు తెచ్చి ఇకడ పోటీ చేయించనున్నారు. పొత్తులో భాగంగా ఎకడో ఒక దగ్గర టికెట్ ఇవ్వాలి కాబట్టి చెన్నూర్ ఇచ్చి చేతులు దులువుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇతర నాయకుల సపోర్ట్ లేకుంటే కనీసం డిపాజిట్ కూడా దకే పరిస్థితి లేదు. వాస్తవానికి సీపీఐ బెల్లంపల్లి టికెట్ అడిగినట్లు తెలిసింది. కానీ.. అకడ కాకుండా ఏ మాత్రం లెఫ్ట్ పార్టీల ప్రభా వం లేని చెన్నూర్‌లో టికెట్ ఇచ్చారు. సరైన అభ్యర్థి లేక బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలనుకున్న రేగుంట చంద్రశేఖర్‌నే ఉమ్మ డి అభ్యర్థిగా బరిలోకి దింపనున్నారు. అలా చేస్తే స్థానికేతరుడైన ఆయన్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
ప్రతిపక్షాల పరిస్థితి ఇలా ఉంటే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల సుమన్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వచ్చారు. చెన్నూర్, మందమర్రి, రామకృష్ణాపూర్లో విసృ్తతంగా పర్యటించి వెళ్లారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రానున్నారు. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలా ప్రచారంలో కారు జోరుగా దూసుకుపోతుంటే, ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో చెన్నూర్‌లో బీఆర్ఎస్ గెలవడం పకా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.