నిర్మల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’ తూతూ మంత్రంగా సాగింది. తొలిరోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్, రెండో రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగిన మాదిరే మూడోరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోనూ పాదయాత్ర నామమాత్రంగా సాగింది. యాత్ర మొదలైన బాదన్కుర్తి నుంచి ఖానాపూర్ దాకా ఎక్కడ చూసినా రహదారులపై పోలీసులే కనిపించారు. రోప్(కంచె)తో పహారా కాశారు. మీనాక్షి నటరాజన్ సమీపంలోకి జనాలతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా వెళ్లనివ్వలేదు. ఈ పాదయాత్ర కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఓట్లు వేయాలనే ప్రచార సభగా మారిపోయింది.
రుణమాఫీ రాలేదని, రైతు బంధు పడలేదని విన్నవించేందుకు వచ్చిన కొందరు రైతులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజలకంటే ఎక్కువ మంది ఇతర జిల్లాల కాంగ్రెస్ నాయకులే ఎక్కువగా వచ్చారు. రెండు రోజుల పాదయాత్రను ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉందని చెప్పి ఒక్కరోజులోనే ముగించారు. ఈ యాత్రలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి కూచడి శ్రీహరిరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.