కుభీర్ : అధికారంలోకి వస్తే పింఛన్లను ( Pensions ) పెంచి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ( Congress ) నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ ( MRPS ) సీనియర్ నాయకులు రాజ్ కుమార్( Rajkumar) , నందు ( Nandu) డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం జుమ్డ గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్నా బహు సాఠె 105వ జయంతి సందర్భంగా గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
ఎన్నికల్లో దివ్యాంగులతో పాటు వృద్ధులకు, బీడీ కార్మికులకు పింఛన్ డబ్బులు పెంచి అందిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం బైంసాలో ఏర్పాటుచేసిన మహా గర్జనకు పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు సాఠే చిత్రపటానికి గ్రామ అధ్యక్షుడు నందు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జెండాను ఆవిష్కరించి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. సాఠే అడుగుజాడల్లో నడుచుకుంటూ సమాజానికి ఉపయోగపడేలా ముందుకు సాగుదామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, సాయిచంద్, జీవన్, సురేష్, గీత్ కుమార్, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.