నిర్మల్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతు కోసం రూ.5 కోట్లు మంజూరు చేసింది. డ్రిప్(డ్యాం రిహాబిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు) పథకం కింద రూ.16 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి పనులు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అంచనాలు తలకిందులయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్లను తామే విడుదల చేశామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నది. కానీ.. డ్రిప్ కోసం రూపొందించిన రూ.16 కోట్ల ప్రతిపాదనలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కడెం ప్రాజెక్టును డ్రిప్ పరిధి నుంచి తప్పించింది. కాగా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టుతోపాటు గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతు పనుల కోసం అంచనాలు తయారు చేసి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీంతో స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులకు డ్రిప్ పథకాన్ని వర్తింపజేస్తూ గ్రీన్‌సిగ్నల్ జారీ చేసింది. కడెంను డ్రిప్ నుంచి మినహాయించడం విమర్శలకు తావిస్తున్నది. స్థానిక అధికారులతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు సరైన సమన్వయం చేయకపోవడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. ఫలితంగా ఐదు కొత్త గేట్ల ఏర్పాటుతోపాటు స్పిల్‌వే, ఇతర మరమ్మతు పనులు జరిగే అవకాశం లేదు. రూ.5 కోట్లతో కొంత మరమ్మతులను పూర్తి చేసిన ప్రస్తుత ప్రభుత్వం.. మిగతా పనుల కోసం ప్రతిపాదనలు రూపొందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలను పక్కన పెట్టి కడెం ప్రాజెక్టును డ్రిప్ పరిధిలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
కడెం ఆయకట్టు 62 వేల ఎకరాలు కాగా.. కేవలం 30 నుంచి 40 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నది. మొత్తం 18 గేట్లలో 2,5వ నంబర్ గేట్లు మరమ్మతుకు నోచుకోలేదు. రెండేళ్ల క్రితమే ముప్పు నుంచి బయటపడింది. మరమ్మతులు ఆలస్యం కావడంతో ఆయకట్టుకు సాగునీటి సమస్య ఏర్పడుతున్నది. అప్పటి ప్రభుత్వం తాత్కాలిక చర్యలు చేపట్టి రైతులకు నష్టం వాటిల్లకుండా చూసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గేట్లు, కౌంటర్ వేయిటర్ల మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ‘డ్రిప్’ పథక నిర్ణయంతో 62వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఏర్పడేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందించే పరిస్థితి లేదు.
కడెం ప్రాజెక్టుకు ఇప్పుడున్న గేట్లతోపాటు అదనంగా మరో ఐదు గేట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిని పట్టించుకోకపోవడం, ఆధునీకరణ కోసం చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువల ఆధునీకరణపై దృష్టి సారించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కాలువల లైనింగ్ చెడిపోవడం, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పూర్తి స్థాయిలో పొలాలకు నీటిని అందించలేనిదుస్థితి నెలకున్నది. యేటా వేలాది క్యూసెక్కుల నీరు గోదావరి పాలవుతున్నప్పటికీ.. ఈ నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికైనా అదనపు గేట్లను ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి రిజర్వాయర్‌లో నీటిని రక్షించాలని రైతులు కోరుతున్నారు.
డ్రిప్ పథకం కింద ఎంపిక చేసిన గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడ్డెన్న మరమ్మతు కోసం రూ.18 కోట్లు, స్వర్ణ కోసం రూ.9 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. కరకట్ట నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు జరిగే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే ఈ నిధులకు మోక్షం లభించే అవకాశం ఉన్నది.